జగన్ ఆస్తుల కేసు ఫాస్ట్ ట్రాక్ విచారణకు పిల్-జోగయ్యకు హైకోర్టు అక్షింతలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకూ జోగయ్యకూ సంబంధమేంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని జోగయ్య ఈ పిటిషన్ లో కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలన్నారు. అయితే ఈ పిల్‍ను అనుమతించేందుకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తిగత కేసులపై పిల్ వేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది.

జోగయ్య పిల్ పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందు ఉంచింది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్, జస్టిస్ ఎన్.తుకారాం బెంచ్ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే వేగంగా విచారణ పీపీని ఆదేశించేలా సీబీఐ డైరెక్టర్ ను కోరారా? అని ముందు జోగయ్య తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

సీబీఐ డైరెక్టర్ ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారని హైకోర్టు బెంచ్ జోగయ్య తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ వద్ద సమాధానం లేదు. దీంతో ప్రచార ప్రయోజనాల కోసం పిల్ వేశారా అని తెలంగాణ హైకోర్టు నిలదీసింది- రెండు వారాలు గడువిస్తే పిల్ విచారణార్హతపై వాదిస్తామని జోగయ్య న్యాయవాది తెలిపారు. రిజిస్ట్రీ అభ్యంతరాలపై వాదన వినిపించేందుకు వీలుగా విచారణను జులై 6కి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications