కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ వేళ - వైవీతో కోమటిరెడ్డి, ఎమ్మెల్యేల భేటీ ..తెర వెనుక..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లోకి షర్మిల చేరిక ఖాయమైంది. ఆ తరువాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇటు షర్మిల ఎంట్రీ వేళ..అటు తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేలు వైసీపీ నేత సుబ్బారెడ్డితో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారింది.
వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ప్రకటించినా సీటు కూడా దక్కలేదు. ఎన్నికల ప్రచారంలోనూ అవకాశం ఇవ్వలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. ఇప్పుడు ఏపీలో షర్మిల సేవలను వినియోగించుకొనే క్రమంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరటానికి షర్మిల సిద్దంగా ఉన్నారు. కానీ, పార్టీ బాధ్యతల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటు షర్మిల ఎంట్రీ సమయంలోనే అటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు.

షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు ఖాయమని ఒక సెక్షన్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు స్వయంగా సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ భేటీ గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైవీ సబ్బారెడ్డి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేరు. కేవలం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా ఉన్నారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డితో మంత్రి కోమటిరెడ్డి కలిసినట్లుగా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో రాజకీయంగా అనేక రకాలుగా ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. అసలు ఈ భేటీ వెనుక కారణాలు ఏంటి..దీని వెనుక దాగి ఉన్న వ్యూహం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications