TTD: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం; అమిత్ షా రాక నేపధ్యంలో భారీభద్రత!!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపై కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది.
తిరుమలలో రద్దీ పరిస్థితి ఇలా
శ్రీవారిని దర్శించుకోవడానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని పేర్కొంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 73 వేల 811 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,901 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్లుగా ఉంది.

నేడు తిరుమలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఇదిలా ఉంటే నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు రానున్నారు. నేటి రాత్రి 7 గంటల 20 నిమిషాలకు తిరుమలకు చేరుకున్న అమిత్ షా తిరుమలలోని వకుళమాత అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం 8 గంటల 25 నిమిషాలకు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకుంటారు.
అమిత్ షా పర్యటనపై సర్వత్రా ఆసక్తి
అమిత్ షా పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసారు. ఎన్నికల ఫలితాలకు ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఘనంగా ముగిసిన కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కాగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని వేద పండితులు చెప్తున్నారు..












Click it and Unblock the Notifications