బ్యూటీ ఆఫ్ అర్జెంటీనా: సునామీలా విరుచుకుపడింది- సెమీఫైనల్స్ స్పాట్ సీల్
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కాన్సాస్ సిటీ స్టేడియంలో స్విట్జర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 3-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. స్విట్జర్లాండ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ.. ఎక్కడే గానీ డీలా పడలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. స్విట్జర్లాండ్ కు ముచ్చెమటలు పట్టించింది. 3-1 తేడాతో మ్యాచ్ ను తన సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొట్టనుందీ మెస్సీ సేన.
నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో.. మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్ కు దారితీసింది. అక్కడ చెలరేగింది అర్జెంటీనా తన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఆఖరి నిమిషాల్లో అర్జెంటీనా స్ట్రైకర్లు చెలరేగి ఆడటంతో స్విస్ జట్టు డిఫెన్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. అల్వరెజ్, లౌతారో మార్టినెజ్ చేసిన సునామీ గోల్స్.. స్విస్ సెమీ ఫైనల్స్ ఆశలను తుడిచిపెట్టేశాయి. కీలక తరుణంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్లు తమ అనుభవాన్నంతా ఉపయోగించి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించినప్పటికీ, స్విట్జర్లాండ్ గట్టి పోటీనిచ్చింది. లైనప్‌లో చేసిన కీలక మార్పులు, మైదానంలో ఆటగాళ్ల మధ్య సమన్వయం అర్జెంటీనాకు కలిసివచ్చాయి. ప్రత్యేకించి.. ద్వితీయార్థంలో స్విస్ ఆటగాళ్లు ఎదురుదాడికి దిగడంతో మ్యాచ్ క్షణక్షణానికి ఉత్కంఠగా మారింది.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అందించిన అద్భుతమైన అసిస్ట్‌తో మ్యాచ్ 10వ నిమిషంలోనే అలెక్సిస్ మెక్ అలిస్టర్ అద్భుతమైన గోల్ సాధించాడు. దీనితో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గోల్ ఇచ్చిన ఉత్సాహంతో అర్జెంటీనా ఆటగాళ్లు మెరుపులా కదిలారు. ఈ మ్యాచ్‌లో నేరుగా గోల్స్ చేయకపోయినప్పటికీ.. జట్టును ముందుండి నడిపించాడు. గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
మిడ్‌ఫీల్డ్‌లో ఆటను నియంత్రిస్తూ, తన అద్భుతమైన పాస్‌లతో ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేశాడు. మొదటి గోల్‌కు అవసరమైన అసిస్ట్‌ను అందించడమే కాకుండా మిగతా ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. మెస్సీ మైదానంలో ఉన్నంతసేపు స్విస్ డిఫెండర్లు అతనిపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చిందంటే అతని కదలికలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది.. అర్జెంటీనా స్ట్రైకర్లకు సులువుగా గోల్ చేసే అవకాశాలను కల్పించింది.

తొలి అర్ధభాగంలో అర్జెంటీనా పూర్తి స్థాయిలో బంతిని తన ఆధీనంలో ఉంచుకుంది. మొత్తం 59 శాతం బాల్ పొసెషన్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. స్విట్జర్లాండ్ డిఫెన్స్ ను విచ్ఛిన్నం చేస్తూ వరుస దాడులకు దిగింది. స్విస్ డిఫెండర్లు కూడా చాకచక్యంగా వ్యవహరించారు. అర్జెంటీనాకు మరిన్ని గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా గట్టిగా అడ్డుకున్నారు. దీనితో ప్రథమార్ధం ముగిసేసరికి అర్జెంటీనా తన 1-0 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.
ద్వితీయార్థంలో ఊహించని మలుపు తిరిగింది. మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకోవడానికి స్విట్జర్లాండ్ వ్యూహాత్మకంగా ఆడింది. 67వ నిమిషంలో స్విస్ ప్లేయర్ డాన్ నెడోయ్ అద్భుతమైన గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. రికార్డో రోడ్రిగ్జ్ అందించిన పాస్‌ను నెడోయ్ గోల్‌గా మలిచినప్పుడు స్విస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలిచినంతగా సంబరపడ్డారు. కేరింతలు కొట్టారు.
ఈ గోల్ తర్వాత ఇరు జట్ల మధ్య పోరు మరింత తీవ్రమైంది. లీడ్ సాధించడం కోసం రెండు జట్ల కోచ్ లు సబ్‌స్టిట్యూషన్స్ శ్రీకారం చుట్టారు. అర్జెంటీనా మేనేజర్ రోడ్రిగో డి పాల్ స్థానంలో లౌతారో మార్టినెజ్‌ను, మొలినా స్థానంలో గొంజాల్లో మోంటియల్‌ను మైదానంలోకి దించి మ్యాచ్ కు మరింత పదును పెట్టారు. అయినప్పటికీ, నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసే వరకు స్కోరు బోర్డు 1-1తోనే నిలిచింది. దీంతో విజేతను నిర్ణయించడానికి మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది.
మ్యాచ్ తీవ్రతను బట్టి అర్జెంటీనా కోచ్ తీసుకున్న నిర్ణయాలు జట్టు విజయానికి ప్రధాన కారణం అయ్యాయి. 78వ నిమిషంలో నికోలస్ టాగ్లియాఫికో స్థానంలో నికో గొంజాలెజ్ రంగంలోకి రావడం జట్టు డిఫెన్స్ విభాగానికి కొత్త బలాన్ని ఇచ్చింది. అలాగే చివరి నిమిషాల్లో లౌతారో మార్టినెజ్, గొంజాల్లో మోంటియల్ వంటి మేటి ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో బంతిపై నియంత్రణ సాధించడం సులువైంది. స్విస్ ఆటగాళ్లు అలసిపోయిన సమయంలో వీళ్లు మ్యాచ్ వేగాన్ని ఒక్కసారిగా పెంచేశారు.

మరోవైపు, స్విట్జర్లాండ్ కూడా వ్యూహాత్మకంగా ఆటగాళ్లను మార్చింది. సిల్వన్ విడ్మర్, జెకి అమ్దౌని వంటి ఆటగాళ్లను రంగంలోకి దించి అర్జెంటీనాను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అదనపు సమయంలో అర్జెంటీనా వేసిన వ్యూహాలకు స్విస్ డిఫెన్స్ ఎదురు నిలువలేకపోయింది. ఇరు జట్లకు లభించిన ఫ్రీ కిక్స్, కార్నర్ల పరంగా కూడా అర్జెంటీనా ఆధిక్యాన్ని ప్రదర్శించి మ్యాచ్‌పై పట్టును కోల్పోకుండా చూసుకుంది.
ఎక్స్‌ట్రా టైమ్ మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు ఆచితూచి ఆడాయి. స్విట్జర్లాండ్ ఆటగాళ్లు శారీరకంగా కాస్త అలసిపోయినట్లు కనిపించారు. దీనిని అర్జెంటీనా అనుకూలంగా మార్చుకుంది. మ్యాచ్ 112వ నిమిషంలో జోస్ మాన్యువల్ లోపెజ్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను జూలియన్ అల్వారెజ్ గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి ప్రవేశించి మ్యాచ్‌పై పట్టు సాధించింది.
స్విట్జర్లాండ్ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు చివరి నిమిషంలో సర్వశక్తులూ ఒడ్డింది. వారి ప్రయత్నాలకు అర్జెంటీనా డిఫెన్స్ అడ్డు గోడలా నిలిచింది. మ్యాచ్ అదనపు సమయం ముగిసే దశలో 120+1వ నిమిషంలో, లౌతారో మార్టినెజ్ మరో అద్భుతమైన గోల్ సాధించి స్విట్జర్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ గోల్‌తో అర్జెంటీనా విజయం అధికారికంగా ఖరారైంది. 3-1 తేడాతో అర్జెంటీనా ఘనవిజయం సాధించి మైదానంలో సంబరాలు జరుపుకుంది.












Click it and Unblock the Notifications