టీటీడీ చేతికి అందిన నిపుణుల నివేదిక
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 74,477 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,294 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుపతి స్విమ్స్ పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమీక్షనిర్వహించారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్విమ్స్ లో మరింత నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. దీనికోసం టీటీడీ మాజీ ఈవో ఐవీ సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ మూడు నెలలుగా అధ్యయనం చేసి, నివేదికను సమర్పించిందని అన్నారు.
మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజినీరింగ్ పనులును మరింత మెరుగుపర్చడం, నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వైద్య నిపుణుల సేవలను వినియోగించుకోవడం, నిధుల సేకరణ తదితర అంశాలపై ఈ కమిటీ తన నివేదికలో పొందుపర్చిందని వివరించారు.
ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై టీటీడీ పాలకమండలిలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి చర్యలను తీసుకుంటామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు మాట్లాడుతూ- స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021 ప్రభుత్వం ఈ ఆసుపత్రి నిర్వహణను టీటీడీకి అప్పగించిందని అన్నారు.
స్విమ్స్ కు టీటీడీ పాలకమండలి సంపూర్ణ సహకారం అందిస్తోందని శ్యామలరావు చెప్పారు. సంవత్సరానికి 60 కోట్ల రూపాయల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్క్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక చేయూతను అందిస్తోన్నామని అన్నారు.
ప్రతి సంవత్సరం 18,000 సర్జరీలు జరుగుతున్నాయని, దాదాపు 4. 50 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు, 47,000 మంది ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని శ్యామలరావు వివరించారు. ఇందులో పేదలే అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛందంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామని అన్నారు.
అంతకుముందు స్విమ్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవానాన్ని బీఆర్ నాయుడు పరిశీలించారు. 391 పడకలు గల కేన్సర్ విభాగం భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లు, పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications