తిరుమలలో నీటికి కరవు: సంక్షోభ నివారణపై టీటీడీ కసరత్తు
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. మంగళవారం నాడు 73,082 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,972 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరవు ఛాయలు అలముకున్నాయి. సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 70,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోండటం, బ్రహ్మోత్సవాలు సమీపిస్తోండటం వంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటివరకు కూడా తిరుమలలో ఆశించినంత వర్షపాతం నమోదు కాలేదు. నీటి లభ్యత భారీగా పడిపోయింది. తిరుమలలో నివసించే స్థానికులు, ఇక్కడికి వచ్చే భక్తుల నీటి అవసరాలను తీర్చడానికి చాలినంత నీళ్లు ఉండట్లేదు. తిరుమలలో ఉన్న అయిదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ స్పష్టం చేసింది కూడా.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్‌ల నుంచి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సరఫరా అవుతుంటుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు.

ప్రస్తుతం ఆయా డ్యామ్‌లల్లో 5,800 లక్షల గ్యాలన్ల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. నీటిని పొదుపుగా వాడాలని కోరింది.
ఈ సంక్షోభ పరిస్థితులపై టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోన్నారు. నీటి ఎద్దడిని నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమావేశం అయ్యారు. తిరుపతి నుంచి అదనపు నీటిని తిరుమలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications