ముస్తాబు అవుతున్న తిరుపతి.. 600 మందికి పైగా పోలీసులతో భద్రత
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుపతి ముస్తాబు అవుతోంది. ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. 17న ధ్వజారోహణం చేస్తారు. అనంతరం అమ్మవారిని చినశేషవాహనంపై ఊరేగిస్తారు. 18 పెద్దశేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి, సింహవాహనం, 20న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21న పల్లకీ ఉత్సవం, గజవాహనం, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణ రథోత్సవం, గరుడవాహన సేవలను నిర్వహిస్తారు. 23 సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీతీర్థం ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ ఇందులో పాల్గొన్నారు. తిరుచానూరు ఆలయం పరిసరాలు, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

పంచమి తీర్థం రోజు దాదాపు 75,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు సకాలంలో పూర్తి చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టీటీడీ సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2,000 పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారని అన్నారు. 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25,000 మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందని అన్నారు.
తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సింఘాల్ సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారని వివరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సందర్శించనున్నారని, ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుండి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి నగరంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పంచమి తీర్థం రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. ఈ సారి ఎక్కువ మంది మహిళా పోలీసులను విధులకు కేటాయించనున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications