తిరుమల నారాయణగిరి గార్డెన్స్ లో ఉత్సవాల్లో భక్తులు, ఆ సేవలు రద్దు చేసిన టీటీడీ !
తిరుపతి/తిరుమల: కలియుగ దైవం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. పరీక్షలు పూర్తి కావడం, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడం, కొత్త విద్యాసంవత్సరంలో కాలేజీల్లో చేరడానికి సిద్దం అవుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తిరుమలలోకి శ్రీనివారిని దర్శించుకోవడానికి క్యూకడుతున్నారు.
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం రెండో రోజు ముగిశాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవంలో రెండవ రోజైన ఆదివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్త దినమని పురాణాల ద్వారా తెలుస్తున్నాయని తిరుమలలోని పెద్దలు చెబుతున్నారు.

ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ తిరుచ్చి లలో శ్రీదేవి, భూదేవి అనుసరించారు. ఈ కార్యక్రమాలతో శ్రీవారి భక్తులు పులకించిపోయారు.
మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, సౌరాష్ట్ర రాగం, దేసిక, మలహరి, యమునా కళ్యాణి, ఆనంద భైరవి నీలాంబరి రాగాలు, వివిధ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది.

తరువాత అన్నమాచార్య సంకీర్తనలతో ప్రాంగణం అంతా మారుమోగింది. ప్రముఖ హరికథా భాగవతార్ శ్రీ వేంకటేశ్వరులు పద్మావతి శ్రీనివాస పరిణయంపై హరికథా పారాయణం భక్తులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఆ తరువాత శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు శ్రీపద్మావతి పరిణయోత్సవ వేడుక ఎంతో వైభవంగా ముగిసింది.












Click it and Unblock the Notifications