తిరుమలలో వసతి గదులు లభించని భక్తులకు గుడ్ న్యూస్: సరికొత్త వ్యవస్థ అందుబాటులో..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం నాడు 60,803 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,930 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 19 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొత్తగా మరో వ్యవస్థను అమలు చేశారు టీటీడీ అధికారులు. వసతి గదులు లభించని భక్తుల కోసం ప్రత్యేకంగా లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ లాకర్ సిస్టమ్ ఇది.
యాత్రికుల వసతి సముదాయం-3లో ఈ కేంద్రీయ లాకర్ల కేటాయింపు కౌంటర్‌ను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం ప్రారంభించారు. పీఏసీ-3లో లాకర్‌ను కేటాయించడానికి మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
భక్తులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. మొత్తం 1,420 లాకర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వసతి గదులు లభించని భక్తులు ఈ కేంద్రీయ లాకర్ల కేటాయింపు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని శ్యామలరావు, సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలలో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనాన్ని ఈవో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని శ్యామలరావు తనిఖీ చేశారు. అక్కడ డోనర్ సెల్‌ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications