TTD: తిరుమలలో కొత్తగా మూడో క్యూ కాంప్లెక్స్ - దర్శనంలో మార్పులు, ఇక..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుటోంది. ఇప్పటికే అమలు చేస్తున్న కొత్త విధానంతో తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీకి అనుగుణంగా ఎప్పటికిప్పుడు అవసరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇక.. పెరుగుతున్న రద్దీతో కొత్తగా తిరుమలలో మూడో క్యూకాంప్లెక్స్ అందు బాటులోకి తెచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.
కొత్త విధానం
తిరుమలలో నిత్యం పెరుగుతున్న రద్దీ వేళ టీటీడీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రతీ రోజు స్వామి వారిని 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కొద్ది రోజులు గా టీటీడీ అమలు చేస్తున్న క్యూ లైన్ మేనేజ్ మెంట్ విధానం ద్వారా దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరినీ లెక్కేసి, క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని భక్తులకు సులభంగా దర్శనం కల్పిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్‌లో భక్తులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రద్దీ ప్రాంతం నుంచి ఖాళీ ఉన్నచోటుకు భక్తులను పంపి తోపులాట చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్‌మెంట్లలోకి నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

మూడో క్యూ లైన్
ఇక, పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో క్యూకాంప్లెక్స్ నిర్మాణం దిశగా యోచన చేస్తోంది. ప్రస్తుతం రెండు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు ఉన్నాయి. కాగా, పెరుగుతున్న రద్దీకి ఇవి సరిపోవటం లేదు. 1970 వరకు సాధారణ క్యూ లైన్ల ద్వారానే భక్తులు ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకునే వారు. రద్దీ పెరిగి క్యూ లైన్లు ఆలయం చుట్టు పక్కల వరకు ఉండేవి. 1983 లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 నిర్మించారు. 14 వేల మంది భక్తులు అందులో వేచి ఉండేలా దీనిని నిర్మించారు. రద్దీ ఇంకా పెరగటంతో 2000 సంవత్సరంలో వైకుంఠం -2 నిర్మించారు. ఇది సరిపోక అయిదేళ్లు క్రితం నారాయణ గిరి పార్కులో తొమ్మది షెడ్ల ను నిర్మించారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా సరిపోవటం లేదు.
తాజా ప్రణాళికలు
భక్తుల రద్దీ పెరగటంతో వీటిని దాటి క్యూ లైన్ కృష్ణతేజ అతిథిగృహం మీదుగా రింగురోడ్డులోని శిలా తోరణం సర్కిల్, బాట గంగమ్మ ఆలయం, అక్టోపస్ భవనం మీదుగా కళ్యాణ వేదిక దాకా దాదాపు 4 కిలో మీటర్ల మేరకు వ్యాపిస్తోంది. దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది బయట క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని రింగ్ రోడ్డులోని క్యూ లైన్లలో భక్తులు చిన్న పిల్ల లు.. వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించటమే శాశ్వత పరిష్కారమని భావిస్తున్నారు. 20 వేల మందికి సరిపోయే విధంగా మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని యోచిస్తున్నారు. ఆర్బీ సెంటర్ కు సమీపంలో నిర్మించాలని సూచన లు రావటంతో.. త్వరలోనే టీటీడీ కొత్త క్యూ కాంప్లెక్స్ పై నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications