తిరుమల CROపై టీటీడీ కీలక నిర్ణయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. శనివారం నాడు 78,821 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,568 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.36 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణ తేజ అతిథిగృహంవరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ (Tirumala CRO)లో మెరుగైన వసతులు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో- ప్రస్తుత సీఆర్ఓ కార్యకలాపాలు, అక్కడి పని చేస్తోన్న సిబ్బంది సంఖ్య, ఇతర అంశాలపై కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో భక్తులకు వసతి, దర్శన టికెట్లు, ఇతర అవసరమైన సేవలను అందించడంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది.. ఈ సీఆర్ఓ. రద్దీ సమయంలో సీఆర్వోకు భక్తులు పోటెత్తుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భక్తులకు సకాలంలో సేవలు అందట్లేదనే ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో అధికంగా అందుతున్నాయి.
దశాబ్దాల కిందట అప్పటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా సీఆర్ఓ భవనం నిర్మితమైంది. ఇప్పుడు రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ సౌకర్యాలు, వసతులు ఉండట్లేదు. ఫలితంగా భక్తులకు గదులు, దర్శనం టికెట్ల కేటాయింపుల్లో జాప్యం ఏర్పడుతోంది.
ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి- విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ డాక్టర్ జీ కార్తీక్.. ఓ ప్రణాళికను రూపొందించారు. సమీక్షా సమావేశం సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఈఓ, ఏఈఓ, ఇతర అధికారులకు వివరించారు.
భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, అక్కడున్న పరిమిత స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, సీఆర్ఓ, పీఏసీ 1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై పలు ప్రతిపాదనలను అధికారుల ముందు ఉంచారు. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక తిరుమల ఏడుకొండల ఆధ్యాత్మిక మహత్యాన్ని, పర్యావరణానికి అనుగుణమైన నగర ప్రణాళికా సూత్రాలను సమన్వయం చేస్తూ రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రస్తుత భవనాల పునరుద్ధరణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ ప్రణాళిక టీటీడీ దీర్ఘకాలిక మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుత రద్దీ పరిస్థితులను చక్కదిద్దడం, కొన్ని దశాబ్దాలుగా ఉన్న భవనాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అలాగే వచ్చే కొన్ని దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని ఈఓ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications