తొలి కేక్ అక్కడే కట్ చేసిన వైఎస్ జగన్: టీటీడీ అర్చకుల సమక్షంలో: సందడిగా తాడేపల్లి
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు అధికారులు ఆయనను కలిసి విషెస్ చెబుతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది.
కొద్దిసేపటి కిందటే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు పలికారు. శ్రీవారి శేషవస్త్రాన్ని భుజంపై కప్పారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. లడ్డూ ప్రసాదాన్ని అందించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జీ వాణిమోహన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి..ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వ్యక్తిగత కార్యదర్శి ధనంజయ రెడ్డి, పలువురు అధికారుల జగన్‌ను కలిశారు. వారి సమక్షంలోనే ఆయన కేక్ కట్ చేశారు.
వైఎస్ జగన్ ఇవ్వాళ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తణుకులో పర్యటించాల్సి ఉంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడే బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తారు. గురువారం నుంచి శనివారం వరకూ కడప జిల్లాలో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications