TTD: తిరుమలలో రథసప్తమి వేడుకలు; ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్పస్వామి!!
ఏడుకొండలపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం, కోరి కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా రథ సప్తమి వేడుకలకు టీటీడీ సిద్ధమైంది. రథ సప్తమి నాడు తిరు వీధులలో ఏడు ప్రధాన వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగే ఘట్టాన్ని చూడటం కోసం భక్తులు భారీగా తిరుమలకు వస్తారు.

రథ సప్తమి నాడు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యం భక్తులను భక్తి సాగరంలో ముంచేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేయి కళ్ళతో నిరీక్షిస్తారు. రథసప్తమి నాడు తిరుమల స్వామివారు అమ్మవార్ల సమేతంగా ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను కరుణిస్తారు.
రథ సప్తమి నాడు ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనం పై మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు చిన్న శేష వాహనంపైనా ఊరేగుతారు . ఆపై ఉదయం 9 నుండి 9.30 గంటల వరకు పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు.
ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు కల్పవృక్షం, 11.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 12.30 నుండి 1గంట వరకు తిరుచ్చిపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆపై సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.












Click it and Unblock the Notifications