తిరుపతిలో హోటల్ వ్యవహారంలో కీలక పరిణామం- గుట్టుచప్పుడు కాకుండా..!!
తిరుమలలో ఒబెరాయ్ భూముల కేటాయింపు వ్యవహారం.. క్రమంగా ముదురుతోంది. రాజకీయ దుమారానికి దారి తీసేలా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమౌతున్నాయి.
టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించడం ఘోరమైన అపచారమని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. పర్యాటక మంత్రిత్వ శాఖకు ఎయిర్ పోర్ట్ సమీపంలో 25 ఎకరాలు కేటాయించవచ్చంటూ టీటీడీ సీపీఆర్వో చేసిన ప్రకటనను ఆయన తోసిపుచ్చారు.

దీనిపై టీటీడీ స్పందించింది. భూమన చేసిన ఆరోపణలను ఖండించింది. ఒబెరాయ్ హోటల్ కు వైసీపీ ప్రభుత్వమే భూమిని కేటాయించిందని ఎదురుదాడికి దిగింది. గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన అలిపిరిలో పర్యాటక శాఖకు చెందిన 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించిందని పేర్కొంది.
ఎప్పుడైతే సదరు భూమిని టూరిజం శాఖ ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినట్లు తెలిసిందో అప్పటి నుండి హిందూ సంఘాలు, స్వామీజీలు, భక్తులు, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించింది.
ఈ నేపథ్యంలో 2024 నవంబర్ 18వ తేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఆ స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు చెందకుండా టీటీడీకి కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించామని పేర్కొంది. ఈ క్రమంలో ఉత్తరం వైపు స్వామి పాదాల చెంత ఆనుకుని ఉన్న భూమిని టీటీడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ సదరు భూమికి బదులుగా రోడ్ కు అవతల వైపు భూమి ని కేటాయించాలని టూరిజం శాఖ కోరిందని టీటీడీ తెలిపింది.
దీనిపై 2025 మే 7వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో మరో తీర్మానం చేశామని, దీనిప్రకారం భూ బదలాయింపునకు అంగీకారం తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని టీటీడీ వివరణ ఇచ్చింది.
ఈ క్రమంలో అలిపిరిలోని స్వామి పాదాల చెంత ఉన్న టూరిజం భూమిని టీటీడీకి , అదేవిధంగా రోడ్డుకు దక్షిణం వైపుగా ఉన్న టీటీడీ భూమిని టూరిజం శాఖకు బదలాయించేందుకు 2025 జూలై 22వ తేదిన జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపాని వివరించింది.
తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో రోడ్డుకు ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని భక్తుల సౌకర్యాల కల్పన నిమిత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో దక్షిణం వైపు ఇప్పటికే పలు నిర్మాణాలు చోటు చేసుకున్నాయని, ఈ కారణంగా దక్షిణం వైపు ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి, తిరుమల కొండకు ఆనుకుని ఉత్తరం వైపుగా ఉన్న పవిత్రమైన భూమిని తాము తీసుకున్నామని స్పష్టం చేసింది.
తిరుమల పవిత్రత, భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి కీలకమైనదని తేల్చి చెప్పింది. దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications