శ్రీవారి ఆలయం బంగారువాకిలి చెంత వేడుకగా - కీలక నిర్ణయాలు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం పర్వదినాలను పురస్కరించుకుని టీటీడీ ఘనంగా ఆస్థానాలు నిర్వహించనుంది. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుమలలో విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. వేసవిలో ఏర్పడే రద్దీ కారణంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ప్రకటించింది.
రేపు ( గురువారం) మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది.

దీనికి కొనసాగింపుగా మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ ప్రతీ ఏటా నిర్వహించే విధంగా బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం, సర్వ ఏకాదశి నిర్వహిస్తారు. ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు జరగ నున్నాయి.
ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి, పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం ఉంటుంది. ఏప్రిల్ 23న అక్షయతృతీయ. ఏప్రిల్ 25న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శంకర జయంతి, శ్రీ అనంతాళ్వారు ఉత్సవారంభం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇక..ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేయనున్నారు. ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని పాలక మండలి ప్రకటించింది.
ఏప్రిల్ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300/ దర్శన టికెట్లు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరారు. వసతి విషయంలోనూ సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications