తిరుమలలో ఉగాది ఆస్థానం: రెండు రోజులు బ్రేక్ దర్శనాలు -సేవలు రద్దు..!!
తిరుమలలో ఉగాది ఆస్థానం వేళ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతీ ఏటా ఉగాది నాడు తిరుమలలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఏడాది 22వ తేదీన ఉగాది రోజున సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఉదయం 6 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలతో పాటుగా సేవలు..బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది ఆస్థానంకు ఏర్పాట్లు
ఉగాది రోజు ఆలయ శుద్ది తరువాత ఉదయం 7 నుండి 9 గంటల మధ్య సమయంలో విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని టీటీడీ అధికారులు వివరించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుతో పాటుగా ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

రెండు రోజులు బ్రేక్ దర్శనాల రద్దు
ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సేవలతో పాటుగా రెండు రోజులు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు. భక్తులు టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరక సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications