100 ఎకరాల విస్తీర్ణంలో..: టీటీడీ అతి భారీ ప్రాజెక్ట్
Tirumala: దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని చేపట్టనుంది. ప్రాచీన, ఆగమ శాస్త్రాలకు అనుగుణమైన దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచుతుంది. వాటిని పరిరక్షిస్తుంది. ధ్వజస్తంభాలు అవసరమైన ఆలయాలకు వాటిని వినియోగిస్తుంది.
ఈ వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదని, భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. ఆగమశాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం నిలువుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించి, ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు.

ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిలువుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో అలంకరిస్తారు.
రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాలోన్ని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును చేపట్టింది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications