శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టీవీఎస్ గ్రూప్ రూ.2 కోట్ల విరాళం
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం నాడు రెండు కోట్ల రూపాయల విరాళం అందింది. చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ సంస్థ అధ్యక్షుడు, సీఈవో రాధాకృష్ణన్ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్ లిమిటెడ్ సంస్థ సీఈవో రంగనాథన్ రూ. కోటి ఇచ్చారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివ రావుకు విరాళాల డిడిలను దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీవారి తీర్థప్రసాదాలను ఈవో వారికి అందజేశారు.

కాగా, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి పుష్పపల్లకి ఉత్సవం శనివారం కన్నులపండువగా సాగింది. సుగంధ పరిమళాలను వెదజల్లే వర్ణరంజిత పుష్పాలతో సర్వశోభాయమానంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిని ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అధిరోహించారు.












Click it and Unblock the Notifications