ప్రకాశ్ రాజ్ మరో ట్విస్టు - "మా" పోలింగ్ లో వైసీపీ కార్యకర్త-రౌడీ షీటర్ : వారితో ఫొటోలు- ఆధారాలంటూ..!!
"మా" ఎన్నికల వివాదం లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. "మా" పోలింగ్ లో బయటి వ్యక్తులు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తూ...వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ "మా" ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీన "మా" ఎన్నికల్లో తమ ప్యానల్ సభ్యుల పైన మోహన్ బాబు - నరేశ్ దౌర్జన్యం చేసారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ రోజున జరిగిన పోలింగ్ ...అక్కడ విజువల్స్ ను సీసీటీవీలో రికార్డు అయిందని..ఆ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారిని కోరారు. ఎన్నికల అధికారి నుంచి తనకు సరైన స్పందన రాలేదంటూ స్థానిక పోలీసు స్టేషనల్ పోలీసుల సాయం కోరారు.

వైసీపీ కార్యకర్త..ఏపీ రౌడీషర్
దీంతో..పోలింగ్ జరిగిన స్కూల్ లో ఉన్న ఫుటేజ్ గదికి పోలీసులు తాళం వేసారు. రెండు ప్యానళ్ల సభ్యులు వస్తే ఫుటేజ్ చూపిస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొన్న విష్ణు..తనకు ప్రకాశ్ రాజ్ ఏ పుటేజ్ చూసినా ఇబ్బంది లేదని స్పష్టం చేసారు. తన ప్యానల్ లోని ఇతర సభ్యులతో కలిసి పోలీసుల సమక్షంలో ప్రకాశ్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ చూసారు. అయితే, ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన ఏడు కెమేరాల విజువల్స్ చూడాల్సి ఉందని..వారం రోజుల్లో స్పందిస్తానంటూ ఆ రోజు చెప్పుకొచ్చారు.
మోహన్ బాబు - విష్ణుతో ఉన్న ఫొటోలను జత చేసి
ఇక, ఇప్పుడు తాజాగా ప్రకాశ్ రాజ్ మరో ఫిర్యాదు చేసారు, పోలింగ్ నాడు క్రిమినల్ రికార్డు ఉన్న వైసీపీ నేత విష్ణు ప్యానల్ బ్యాడ్జ్ తో వచ్చాడని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావుగా చెబుతున్నారు. రౌడీషీటర్ నూకల సాంబశివరావు హాల్‌లో ఉన్నట్టు ఎన్నికల అధికారికి రాసిన లేఖలో సాక్ష్యాలు జత చేసారు. "మా" సభ్యులు కాని వ్యక్తులను ఎలా అనుమతించారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఓటర్లను బెదిరించారని చెప్పారు.

పోలింగ్ కేంద్రంలో బెదిరింపులకు దిగారని ఆరోపణ
విష్ణు ప్యానెల్ బ్యాడ్జిలు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు 'మా' ఎన్నికల్లో చొరబడ్డారని తెలుపుతూ జగన్, మోహన్‌బాబు, విష్ణుతో వైసీపీ కార్యకర్త దిగిన ఫోటోలను ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి పంపారు. ఏపీలో సాంబశివరావు పైన రౌడీషీట్ ఉందని.. పలు కేసుల్లో ఉన్నాడని ప్రకాశ్ రాజ్ చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలోనూ అతని మీద కేసులు నమోదయ్యయని పేర్కొన్నారు. ఆ వ్యక్తి పోలింగ్ సమయంలో బెదిరింపులకు దిగారని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు. అయితే, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాత్రం తనకు ఇంకా ఫిర్యాదు ఏదీ రాలేదని చెబుతున్నారు.

ఎన్నికల అధికారి వాదన మరో విధంగా
ఎన్నికలు జరిగే సమయంలో ఫిర్యాదు వస్తే తాను చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని..ఎన్నికలు పూర్తయిన తరువాత తనకు ఫిర్యాదు చేసినా..తన చేతుల్లో ఉండదని ఆయన చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఈ ఫిర్యాదు పైన ఎన్నికల అధికారి అధికారింగా స్పందన ఇచ్చిన తరువాత...న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు "మా" ఎన్నికల వ్యవహారం ఇప్పల్లో ముగిసిపోయేలా లేదు.