జగన్ పార్టీ ఎమ్మెల్యేకు బెదిరింపులు: సినీ ఫక్కీలో పట్టివేత
గుంటూరు: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఫోన్‌లో బెదిరించిన ఆగంతకులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి గత పది రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆగంతకులు మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణహానీ తప్పదంటూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ట్రాప్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి మావోయిస్టు పార్టీ పేర ఒక లేఖ వచ్చింది. అందులో తమ ప్రతినిధులు వస్తారు సహకరించాలని కోరడం, ముగ్గురు యువకులు వచ్చి 40 వేలు తీసుకుంటూ సినీ ఫక్కీలో పోలీసులకు పట్టుబడటం జరిగింది. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల సమీపంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 29వ తేదీన సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి జగదీష్ పేరిట ఓ లేఖ వచ్చింది.

ఇందులో ఆరునెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రామకృష్ణారెడ్డిని కలవడానికి ఇద్దరిని కేటాయిస్తే భద్రతా కారణాల వల్ల వారు అప్పట్లో కలవలేదని, గత నెలలో ఆంధ్రా, ఒడిశ్శా సరిహద్దుల్లో జరిగిన పార్టీ చర్చావేదికలో ఈ అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి ప్రజలను మభ్యపెట్టారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అదే విధానాలు కొనసాగిస్తున్నారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని లేఖలో ఉంది.
చాలా మంది మావోయిస్టు సానుభూతిపరులు, నేతలు జైళ్లలో మగ్గుతున్నారని, ముఖ్యంగా జిల్లా కమిటీ సభ్యుడైన జహీర్ జిల్లా సబ్‌జైలులో కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని అతన్ని బయటకు తీసుకురావడం కోసం మీ సహాయం కావాలని పేర్కొన్నారు. ఇందుకు గాను మిమ్మల్ని మా ప్రతినిధులు వచ్చి కలుస్తారు, మీ వంతుసాయం చేయాలని పేర్కొని ఉంది. ఆ తర్వాత నరేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి పార్టీ కార్యాలయంలో వచ్చి కలుస్తాం, పార్టీకి 40 వేల రూపాయల చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పార్టీ కార్యాలయానికి ముగ్గురు యువకులు వచ్చే సరికి అప్పటికే ఎస్‌పి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఉండటంతో పోలీసులు వలపన్ని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు అసలైన మావోయిస్టులా, నకిలీలా అనే భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications