మహారాజా ఆస్పత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి, విశాఖలో టీడీపీ కార్పొరేటర్
అమరావతి: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇప్పటికే పదుల సంఖ్యలో రోగులు మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువగా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తోంది. మిగతా రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తోంది.
Recommended Video

మహారాజా ఆస్పత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి
కాగా, ఏపీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఆక్సిజన్ అందక ఇద్దరు రోగులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. ఇక మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కరోనా ఐసోలేషన్ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించారని అధికారులు వెల్లడించారు.

ఇతర ఆస్పత్రులకు రోగుల తరలింపు..
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మహారాజా ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ప్రైవేటు అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నారు. మరికొందరిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించేందుకు త్వరిత గతిన చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, మహారరాజ ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరి మరణానికి ఆక్సిజన్ కొరత కారణం కాదని ఆస్పత్రి అధికారులు తెలిపారు.

కరోనాతో టీడీపీ కార్పొరేటర్ మృతి
ఇది ఇలావుండగా, కరోనా మహమ్మారి బారినపడిన గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేటర్ ఒకరు ప్రాణాలు వదిలారు. జీవీఎంసీ 31 వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేటర్ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

విషమంగానే సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి..
ఇటీవల కరోనా బారినపడిన మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సబ్బంహరికి కరోనాతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

కరోనా బారినపడిన యువకుడు ఆత్మహత్య
మరోవైపు, విశాఖపట్నంలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మర్చంట్ నేవీలో సీ మెన్‌గా పనిచేస్తున్న సునీల్ కు ఇటీవల కరోనా సోకింది. దీంతో కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు. అంతకుముందే, సునీల్ ప్రేమించిన అమ్మాయే అతనిపై వేధింపుల కేసు పెట్టిందీి. ఈ క్రమంలోనే కరోనా బారినపడటంతో అతను మానసికంగా వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications