2 నౌకలు మునక, మూడ్రోజుల్లో చేశామని మంత్రి
విజయవాడ/విశాఖ: హుధుద్ తుఫాను ధాటికి విశాఖపట్నంలో రెండు నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. దీనిలో ఒకటి సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సాగర్ పర్చిమి. మరొకటి షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డీఎం సింగ్. పరిణామంలో నౌకకన్నా చిన్నవి, పడవ కన్నా పెద్దవైన ఈ రెండు.. హుధుద్ తీరాన్ని తాకే సమయానికి ఫిషింగ్ హార్బర్‌లో ఉన్నాయి.
మూడ్రోజుల్లో సాధారణ స్థితికి విశాఖ
హుధుద్‌తో తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నంను కేవలం మూడు రోజుల్లో సాధారణ పరిస్థితికి తెచ్చామని మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే ఇది సాధ్యమైందన్నారు.

రుణమాఫీ విషయంలో సీఎం ద్వంద్వ వైఖరి
చంద్రబాబు రుణమాఫీ విషయంలో ద్వం ద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ఆయన తన విధానాన్ని మార్చుకోని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొలుసు పార్థసారథి హెచ్చరించారు. శనివారం విజయవాడలో కృష్ణా జిల్లా పార్టీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. హామీలను నెరవేర్చటంలో బాబు విఫలమయ్యారని, దీనికి నిరసనగా నవంబర్ 5న అన్ని మండల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు తెలుపుతామని చెప్పారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని పార్టీ శ్రేణులను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశించారన్నారు.
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసంలో ప్రతీ శనివారం, ఆదివారం ఒకే రోజున అయిదు పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటలకు పంచారామదర్శిని పేరుతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకర్ చెప్పారు.
శనివారం సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు కాకినాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటిరోజు రాత్రి 8 గంటలకు కాకినాడకు చేరుకుంటాయన్నారు. డీలక్స్ బస్ ఛార్జీలు పెద్దలకు రూ.650లు, పిల్లలకు రూ.500లు, అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఛార్జీలు పెద్దలకు రూ.580, పిల్లలకు రూ.480 అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications