జగన్‌కు షాక్: సైకిల్ ఎక్కనున్న ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు?
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు సైకిల్ ఎక్కడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి ఆ ఇద్దరు శాసనసభ్యులు ఒకే సామాజికవర్గానికి చెందినవారని అంటున్నారు. వీరిద్దరూ తూర్పు ప్రకాశానికి చెందినవారే. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆ ఇద్దరు శాసనసభ్యులు దూరంగా ఉంటున్నారు. ప్రకాశం జిల్లాలో మాత్రం అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైకాపా శాసనసభ్యులు టిడిపిలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
తెలుగుదేశంపార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం వారిద్దరు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ తెలుగుదేశంపార్టీ గూటికి చేరితే జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఎన్నికల సమయంలో వైసిపి తరుపున ఆరుగురు, తెలుగుదేశంపార్టీ తరుపున ఐదుగురు శాసనసభ్యులు గెలుపొందగా, చీరాల నియోజకవర్గం నుండి ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
ఇటీవల ఆమంచి తెలుగుదేశంపార్టీ తీర్థం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పుచ్చుకోవటంతో వైసిపికి, తెలుగుదేశంపార్టీకి చెరి సమానంగా బలం ఉంది. ప్రస్తుతం మరో ఇద్దరు శాసనసభ్యులు వైసిపిని వీడి తెలుగుదేశంపార్టీలో చేరితే ఆ పార్టీ బలం ఎనిమిదికి చేరి వైకాపా బలం నలుగురికి తగ్గే అవకాశాలున్నాయి. వైకాపాకు చెందిన ఆ ఇద్దరు శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీలో చేరితే ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనాయకుల పరిస్థితి ఏమిటన్న చర్చ పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోది.

తూర్పుప్రకాశంలోని ఓ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కుమారుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా పార్టీశ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర టిడిపి ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిని పార్టీలోకి చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ నియోజకవర్గంలోని రాజకీయం మొత్తం ఆ శాసనసభ్యుడి గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉంది.
కొండపి నియోజకవర్గంలో కూడా ఆ శాసనసభ్యుడు జోక్యం చేసుకుంటుండటంతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వరికూటి అశోక్‌కుమార్‌కు కొంతమేర ఇబ్బందిగా ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. మొత్తంమీద ఆ ఇద్దరు శాసనసభ్యులు మాత్రం త్వరలోనే తెలుగుదేశంపార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం.
ఇప్పటివరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో గెలుపొంది ఇన్‌చార్జి జిల్లాపరిషత్ చైర్మన్‌గా వ్యవహరించిన నూకసాని బాలాజి హయంలో వైకాపా జడ్‌పిటిసిలకు జిల్లాపరిషత్‌లో మాట్లాడేందుకు తక్కువ అవకాశం ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో జిల్లాపరిషత్ చైర్మన్‌గా ఈదర హరిబాబు బాధ్యతలు స్వీకరించారు.
కందుకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా తెలుగుదేశంపార్టీ గూటిలోకి చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మహీధర్‌రెడ్డికి పార్టీపెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఆ నియోజకవర్గంలోనూ రాజకీయం మారే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లోనూ తెలుగుదేశంపార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఘనవిజయం సాధించటానికి వైకాపాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించారు.












Click it and Unblock the Notifications