ఏకగ్రీవం: సాయిరెడ్డి గైర్హాజరు, ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్ధుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.
నామినేషన్ల గడువు ముగియడంతో నాలుగు సీట్లకు నలుగురే అభ్యర్ధులు మిగలడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పి, ధ్రువీకరణ పత్రాలు అందించారు. టీడీపీ, బీజేపీ తరుపున సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరిలు పలువురు టీడీపీ మంత్రులతో కలిసి వచ్చి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
ఏపీ ప్రజలతు చేతనైనంత సేవ చేస్తా: కేంద్రమంత్రి సురేశ్ ప్రభు
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైనమిక్ సీఎం అని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కితాబిచ్చారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఏపీ రాష్ట్రాభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తనకు చేతనైనంత సేవ చేస్తానని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా తాను శుక్రవారం తిరుమల వెళ్లి శ్రీవారి ఆశీర్వాదం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు సహా రైల్వే ఉన్నతాధికారులతో సమవేశమవుతానని, రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు.

హామీల అమలుకు కృషి చేస్తా: కేంద్ర మంత్రి సుజనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సహా ఇతర హామీల అమలయ్యేలా చేయడంలో కృషి చేస్తానని సుజనాచౌదరి స్పష్టం చేశారు.
ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: టీజీ
తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీజీ వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఏపీ సమస్యలపై పోరాడుతానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్దులుగా నామినేషన్లు దాఖలు చేసిన డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మరికాసేపట్లో వీరు ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా, వైసీపీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయి రెడ్డి మాత్రం హాజరు కాలేదు.
వ్యక్తిగత కారణాలతోనే విజయసాయి హాజరు కాలేదని, ఈ నెల 6వ తేదీన ధ్రువీకరణ పత్రాన్ని అందుకోనునన్నట్లుగా తెలుస్తోంది. కాగా, జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 రాజ్యసభ స్థానాలకు పోటీ జరగనున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications