జై సమైక్యాంధ్ర: మల్కాజిగిరి నుంచి ఉండవల్లి పోటీ?
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రెడ్డి తెలంగాణలోని మల్కాజిగిరి సీటు నుంచి లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉండవల్లి ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. జై సమైక్యాంధ్ర తరఫున ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు.
జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకారం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ వేచి చూస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మల్కాజిగిరి నుంచి పోటీ చేసి రాష్ట్ర విభజనవాదులకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని జై సమైక్యాంధ్ర పార్టీ అనుకుంటోంది. తెలంగాణవాదం బలంగా లేని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని స్థానాలకు ఆ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ గత ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని అనుకోవడం వెనక పనిచేసింది రాష్ట్ర విభజననే. మల్కాజిగిరిలో అత్యధిక ఓటర్లు సీమాంధ్రకు చెందినవారు. దీంతో పలువురు సీమాంద్ర నాయకులు ఈ సీటుపై కన్నేశారు. లోకసత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆ సీటు నుంచి లోకసభ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.












Click it and Unblock the Notifications