అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి...లోకేష్ పర్యవేక్షణ: సిఎం చంద్రబాబు
Recommended Video

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిరుద్యోగ భృతి పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ఈ హామి అమలుకు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ పథకానికి 'యువ నేస్తం' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగ పథకాన్ని గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచి నిరుద్యోగులకు అందించాలని టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు.

నిరుద్యోగ భృతి...లోకేష్ పర్యవేక్షణ
టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిరుద్యోగ భృతి 'యువనేస్తం' కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని...ఈ ప్రక్రియను ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు. జలవనరుల ప్రాజెక్టులకు నిధుల మంజూరు విషయంలో గ్రీన్ ఛానల్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పంట సంజీవని...అగ్రస్థానం
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ పంట సంజీవని అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. శాసనసభలో నదుల అనుసంధానంపై నిర్వహించిన చర్చ సందర్భంగా వ్యవసాయంలో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు.

నీటి ప్రాజెక్టులు...పూర్తి
ప్రాధాన్యతా క్రమంలో 54 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధుల విడుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.10 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించామని, ఈనెలలోనే మరో 12 ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు.రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ దాదాపు 650 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందని సీఎం వెల్లడించారు. ఈ సీజన్‌లో కృష్ణా, గోదావరి నదుల ద్వారా వచ్చిన నీటిలో 232 టీఎంసీల నీటిని ఖరీఫ్‌కు వినియోగించుకున్నామన్నారు.

సాగునీరు...విడుదల
ఈ ఏడాది సముద్రంలోకి 2వేల టీఎంసీల నీటిని వదలాల్సి వచ్చిందన్నారు. శ్రీశైలంలో 140 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 172.2 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పులిచింతలలోనూ 14.5 టీఎంసీలు నిల్వ ఉంచామన్నారు. దాదాపు రెండు కోట్ల ఎకరాల సాగుభూమిలో ప్రస్తుతం కోటి 4లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నమని సీఎం తెలిపారు. మరో 95లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications