సుదూర ప్రయాణం: కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఇలా చెప్పారేంటీ?
AP and Bihar: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఆమెకు ఇది ఏడవది. ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్‌ను సభకు సమర్పించారు.

ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం.. భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 272 కాగా.. 292 మంది సభ్యుల బొటాబొటి మెజారిటీ ఉంది ఎన్డీఏకు. ఇందులో కూడా రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.
ఆ రెండూ తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్). ఈ రెండింటికీ కలిపి 28 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో- టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ఈ వార్షిక బడ్జెట్‌లో భారీగా వరాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను సంతృప్తి పరిచేలా ఆర్థిక చేయూతలను ప్రకటించింది.
ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పర్చడానికి 15,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి సహకరిస్తామని ప్రకటించారు నిర్మల సీతారామన్. ఏపీలో వెనుకబడిన మూడు జిల్లాల అభిృద్ధికి ప్రత్యేకంగా గ్రాంట్‌ను మంజూరు చేస్తామనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. బిహార్‌కు 26,000 కోట్ల రూపాయలను కేటాయించారు.
బడ్జెట్‌పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీ, నిర్మల సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించడం సంతోషకరమని అన్నారు.

బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ అంశాలతో పాటు కేంద్రం ప్రకటించిన మద్దతుతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారు. దీని కోసం సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్.. మరింత ప్రగతికారకంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని చెప్పారు.
కాగా- తన ట్వీట్‌లో చంద్రబాబు.. ఏపీ పునర్నిర్మాణానికి సుదీర్ఘ ప్రయాణం అనే పదాన్ని వాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంటే ఇప్పట్లో అటు రాజధాని అమరావతి గానీ, పోలవరం ప్రాజెక్టు గానీ సంపూర్ణంగా పూర్తి కాబోవనే అర్థాన్ని ప్రస్ఫూటింపజేసిందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications