Amit Shah: రేపు, ఎల్లుండి ఏపీలోనే అమిత్ షా- ఫలితాల వేళ రాకపై చర్చ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ శాతాలు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీకి చెందిన అగ్రనేత అమిత్ షా రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా పర్యటనలు జరిపారు. ఇప్పుడు చివరి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగబోతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన ఆయన.. రేపు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఏపీకి రానున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. రేపు రాత్రి ఏడున్నర గంటలకు తిరుమలకు అమిత్ షా రానున్నారు.

రేపు రాత్రి తిరుమలకు ప్రత్యేక విమానంలో రానున్న అమిత్ షా.. నేరుగా వకుళ మాత గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అనంతరం ఎల్లుండి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు తిరిగి వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటనలో ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్ తో భేటీ ఉంటుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications