ఎన్నికల వేళ లోకేష్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలోకి దిగాయి. అభ్యర్దుల ప్రకటన పూర్తి కావటంతో మేనిఫెస్టో పైన ఫోకస్ చేసాయి. ప్రత్యర్ధి పార్టీల పైన విమర్శలు చేస్తూ తమ లక్ష్యాలను వివరిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం నేతనారా లోకేశ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఅర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కల్పించింది. అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్కౌంటర్ తరువాత లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. లోకేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ వచ్చింది. తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్లకు లోకేశ్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు.

భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో నలుగురైదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఉంటారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేశ్ కు భద్రతను తగ్గించింది.
ప్రస్తుతం లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిన లోకేశ్ ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. లోకేశ్ ను ఓడించేందుకు వైసీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల సమరం వేళ లోకేష్ భద్రత పైన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications