కెసిఆర్‌తో దొరల రాజ్యం: అదును చూసి జైరాం వాత
హైదరాబాద్: తనను కలిసిన తెలంగాణ జెఎసి నాయకులతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను తెలంగాణ జెఎసి నేతలు గురువారం సాయంత్రం కలిశారు. కాంగ్రెసులో తెరాసను విలీనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విముఖత ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జైరాం రమేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
కెసిఆర్ తీరు బాగా లేదని, తెరాస నాయకులు జాగో బాగో అంటూ ప్రజలను రెచ్చగొట్టారని ఆయన విమర్శించారు. కెసిఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజలు ఆందోళనకు గురయ్యారని ఆయన అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వస్తే దొరల రాజ్యం వస్తుందని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ కాంగ్రెసుతోనే సాధ్యమని ఆయన అన్నారు.

మాటకు కట్టుబడి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ జెఎసి కాంగ్రెసుకే సహకరించాలని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే తెలంగాణ జెఎసి నాయకులు కాంగ్రెసులో చేరాలని ఆయన సూచించారు. తిరుపతి ప్రజలు కెసిఆర్ వ్యాఖ్యలతో మండిపడుతున్నారని ఆయన చెప్పారు.
చిన్న రాష్ట్రాల అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల అభివృద్ధి కూడా జాతీయ పార్టీలతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ జెఎసిలు సమన్యయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడానికి తాను ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. రసమయి బాలకిషన్‌తో జైరాం రమేష్ మూడు పాటలు పాడించుకున్నారు.












Click it and Unblock the Notifications