చంద్రబాబు అరెస్టుపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు: టీడీపీ ఎంపీ నానితో ఇలా
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం పార్లమెంట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానితో నితిన్ గడ్కరీ మాట్లాడారు. చంద్రబాబు యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు. భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు అని గడ్కరీ చెప్పారని కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులతోపాటు పలువురు ప్రముఖులు అరెస్టును నిరసిస్తున్నారు.

ఓవైపు పార్లమెంటులోనూ, మరోవైపు, ఏపీ అసెంబ్లీలోనూ తెలుగుదేశం సభ్యులు చంద్రబాబు అరెస్టు(chandrababu arrest)ను ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ అసెంబ్లీ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
ఇది ఇలావుండగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రాజధాని అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు.. దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. అదే ఏడాది మే 29న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు. కేసులోని ఇతర నిందితులకు బెయిల్ వచ్చిందని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications