విశాఖ రాజధానికి కేంద్రమంత్రుల ఆమోదముద్ర ? పెట్టుబడుల సదస్సుకు హాజరుతో సంకేతం !
ఏపీలోని విశాఖలో జరుగుతున్న రెండు రోజుల పెట్టుబడుల సదస్సుకు పలువురు కేంద్రమంత్రులు హాజరై వైజాగ్ రాజధాని వాదనకు అనధికారికంగా ఆమోదముద్ర వేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హైకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో తీర్పు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ తరుణంలో కొత్త రాజధాని వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం ద్వారా అందరి ఆమోదముద్ర వేయాలని భావించింది.ఇందుకు తగినట్లుగానే కేంద్రమంత్రులు కూడా హాజరై విశాఖే రాజధాని అనే వాదనకు మద్దతు పలికారు.

విశాఖ సదస్సుకు కేంద్రమంత్రులు
విశాఖలో నిన్న, ఇవాళ రెండు రోజుల పాటు వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా తరలివచ్చారు. ఏపీ సర్కార్ ఆహ్వానం మేరకు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, శర్భానంద్ సోనోవాల్ తో పాటు పలువురు తరలివచ్చారు. ఏపీ కొత్త రాజధానిగా విశాఖను పరిచయం చేస్తూ సీఎం జగన్ వీరందరినీ ఆహ్వనించారు. పెట్టుబడుల సదస్సులోనూ ఏపీకి కాబోయే రాజధాని విశాఖేనని, తానూ త్వరలో ఇక్కడికి వచ్చేస్తానని వారి ముందే పారిశ్రామిక వేత్తలకూ చెప్పేశారు. దీంతో కేంద్రమంత్రులు కూడా తమ ప్రసంగాల్లో, వ్యాఖ్యల్లో విశాఖే రాజధానిగా ప్రస్తావించారు.

జగన్ వాదనకు మద్దతు
ఏపీ రాజధానిగా అమరావతినే ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టును ఆశ్రయించి మూడు రాజధానుల కోసం పోరాటం చేస్తున్న సీఎం జగన్.. ఇప్పుడు విశాఖ సదస్సు ద్వారా రాజధానిపై క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులు, వచ్చే ఎన్నికలపై అంచనాలు, ఇలా ఎటు చూసినా రాజధాని గురించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనను నిజం చేసేలాగే కనిపిస్తున్నాయి. ఎటొచ్చీ సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో జగన్ చేస్తున్న విశాఖ రాజధాని వాదనకు పెట్టుబడిదారులతో పాటు కేంద్రమంత్రులు కూడా మద్దతు పలికారు.

కేంద్రమంత్రుల ఆమోదముద్ర ?
విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భవిష్యత్తు రాజధాని ఇదేనంటూ పదే పదే సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు.. దౌత్యవేత్తలు, పెట్టుబడిదారులు, కేంద్రమంత్రులతో చెప్పేస్తున్నారు. దీంతో వారు కూడా ఈ వాదనకు మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖను రాజధానిగా గుర్తించడం వల్లే వారంతా ఇక్కడికి తరలివచ్చారు. అంతే కాదు తమ పెట్టుబడి వ్యూహాల్లోనూ విశాఖకు ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే వ్యాపారవేత్తల ధోరణి అర్దమవుతోంది. దీనికి కీలక కారణం ఏపీ సర్కార్ నిర్వహిస్తున్న సదస్సులో కేంద్రమంత్రులు పాల్గొనడమే. తద్వారా కేంద్రమంత్రులు తమ హాజరుతో విశాఖ రాజధానిపై పారిశ్రామికవేత్తలకు కూడా నమ్మకం కలిగించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications