• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బొత్స అస్తులే టార్గెట్‌గా సమైక్యవాదుల దాడులు

By Pratap
|

విజయనగరం: సమైక్యాంధ్ర ఆందోళనకారులకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లక్ష్యంగా మారినట్లు కనిపిస్తున్నారు. శుక్రవారం ఆయన ఆస్తులపై ఆందోళనకారులు పెద్ద యెత్తున దాడి చేశారు. శనివారం కూడా ఆయన నివాసం వద్ద ఆందోళనలను కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం బొత్స నివాస ముట్టడికి మరోసారి విద్యార్థులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసం వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలను ప్రయోగించినా సమైక్యవాదులు ఆందోళనలను కొనసాగించడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. అయినా సమైక్యవాదులు వెనక్కి తగ్గలేదు. సత్తిబాబును, ఆయన భార్య, ఎంపీ ఝాన్సీని 'ద్రోహులు'గా అభివర్ణిస్తూ వారి ఆస్తులపై దాడులు చేశారు.

Botsa Satyanarayana

రాష్ట్ర విభజనకు సంబంధించి సిడబ్ల్యుసి ప్రకటన వెలువడిన జూలై 30వ తేదీ నుంచి నేటి వరకు బొత్స, ఆయన భార్య ఝాన్సీ జిల్లాలో అడుగు పెట్టలేదు. గత 65 రోజులుగా జిల్లాలో సమైక్య ఉద్యమం వారిద్దరి చుట్టూనే తిరిగింది. తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం వెనక బొత్స మంత్రాంగం ఉందని జిల్లా ప్రజలు నమ్ముతున్నారు. దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఉద్యమం సాగిస్తున్నట్లు అర్థమవుతోంది.

శుక్రవారం బొత్స, ఆయన కుటుంబ సభ్యులనే ఆందోళనకారులు ప్రధానంగా టార్గెట్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాల, ఇతర ఆస్తులపై దాడి చేశారు. సత్య కళాశాలపై విద్యార్థులు రాళ్ల దాడులు చేశారు. కళాశాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 8 గంటల సమయంలో మరోసారి కాలేజీపై రాళ్ల వాన కురిపించారు. పలుగులు, పారలతో వెళ్లి కూల్చి వేయడానికి ప్రయత్నించారు. పోలీసు బలగాలు ఉద్యమకారులను అక్కడి నుంచి చెదరగొట్టాయి.

అంతకు ముందు ఉదయం బొత్స ఇంటి వెనుకకు చేరుకుని అటునుంచి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో భయానక వాతావరణం నెలకొంది. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయంపైనా రాళ్లు రువ్వడంతో బయట, లోపలి అద్దాలు ధ్వంసమయ్యాయి. వీటికి కొనసాగింపుగా రాత్రి ఏడు గంటల సమయంలో బొత్సకు చెందిన సత్య విజన్ కేబుల్ నెట్‌వర్క్‌పై దాడి చేశారు. స్టూడియోకు నిప్పు పెట్టారు. స్టూడియో ముందు భాగాన్ని, లోపలి భాగాన్ని ధ్వంసం చేశారు. తర్వాత లోపలి యాంటెన్నాలు, కంప్యూటర్లు, కేబుల్ వైర్లు, ఇతర ఫర్నిచర్‌ను బయటకు విసిరేసి పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో, స్టూడియో అగ్ని కీలల్లో పూర్తిగా తగులబడిపోయింది.

మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్ అధికారులపైనా సమైక్యవాదులు దాడి చేశారు. ఫైరింజన్‌ను తిప్పి పంపేశారు. మరికొంతమంది తోటపాలెంలోని సత్య జూనియర్ కళాశాలలోకి దూసుకుపోయి విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న ఫర్నిచర్‌ను, రికార్డులను, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. జనప్రియ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేసి మద్యం సీసాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బొత్స ఇంటి ముట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. బొత్స పేరున్న శిలా ఫలకాలను జేఎన్‌టీయూ విద్యార్థులు ధ్వంసం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో డిగ్రీ కళాశాలను ధ్వంసం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు బొత్స ఇంటి వద్ద ఆందోళనకారులు మోహరించారు. ఆయన ఆస్తులన్నిటినీ ధ్వంసం చేస్తూనే ఉన్నారు.

తన ఆస్తులపై దాడులు జరగడంపై బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. దాని వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు.

English summary
United Andhra supporters made target PCC president Botsa Satyanarayana's properties in Vijayanagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X