ఏబీకి జగన్ అలా...! పూనం, జవహర్ రెడ్డికి చంద్రబాబు ఇలా...!
ఏపీలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సలామ్ కొట్టే అధికారులు ఎంతో కొంత మంది కచ్చితంగా ఉంటారు. బిజినెస్ రూల్స్ తో సంబంధం లేకుండా ప్రభుత్వాధినేతల సేవలో తరిస్తూనే ఉంటారు. ఇదంతా సహజమే అయినా ఇలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త ప్రభుత్వాధినేతల వ్యవహారశైలి కూడా చర్చనీయాంశమవుతూనే ఉంది. ఇదే కోవలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు రిటైర్మెంట్ వేళ పోస్టింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ సస్పెండ్ చేసింది. నిఘా పరికరాల కొనుగోలు ప్రయత్నాల కేసులో ఆయన్ను ఇరికించి చివరి నిమిషం వరకూ వేధించింది. సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరట పొందినా... అదే కేసులో మరోసారి సస్పెండ్ చేసింది. దాన్ని క్యాట్, హైకోర్టులో కొట్టేయడంతో పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్ధితుల్లోనూ రిటైర్మెంట్ రోజు వరకూ ఆగి చివరి గంటల్లో ఏబీకి పోస్టింగ్ ఇచ్చింది.

సీన్ కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ కు అనుకూలంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య ఇద్దరినీ తాజాగా చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే పక్కనబెట్టింది. వీరిద్దరినీ జీఏడీలో రిపోర్టు చేయించింది. అయితే ఈ నెలాఖరున వీరిద్దరికీ రిటైర్మెంట్ ఉండటంతో వారు అడక్కుండానే పోస్టింగ్ ఇచ్చింది.
మాజీ సిఎస్ జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం..సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏబీని రిటైర్మెంట్ చివరి రోజు కూడా అప్రాధాన్య ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా జగన్ సర్కార్ పోస్టింగ్ ఇస్తే.. ఇప్పుడు మాత్రం చంద్రబాబు జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యకు మాత్రం కీలకమైన సంక్షేమ శాఖ, జీఏడీల్లో పోస్టింగ్ లు ఇచ్చి గౌరవంగా రిటైరయ్యే అవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications