Vande Bharat express:వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ క్లాస్ - హైదరాబాద్ కేంద్రంగా..!!
దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు నడుస్తున్న వందే భారత్ రెండు క్లాసుల కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా వందే భారత్ లో స్లీపర్ క్లాస్ ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి బీహెచ్ఈఎల్ ఆర్దర్ దక్కించుకుంది. రూ 120 కోట్ల ఖర్చుతో ఒక్కో రైళ్లో స్లీపర్ క్లాస్ లు సిద్దం చేయనుంది.
పెరుగుతున్న ఆదరణ: దేశంలో ఇప్పుడు వందేభారత్ కు ఆదరణ క్రమేణా పెరుగుతోంది. ప్రయాణీకులు వందే భారత్ లో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి ఇప్పటి వరకు రైల్వే అధికారుల అంచనాలకు తగినట్లుగా ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతోంది.
రానున్న రోజుల్లో కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రయాణీకుల డిమాండ్ మేరకు వందేభార్ లో స్లీపర్ కోచ్ లను ప్రవేశ పెట్టేందుకు రైల్వే నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం 16 కోచ్ లతో నడుస్తున్న రైళ్లల్లో ఈ స్లీపర్ కోచ్ లను ప్రారంభించాలని భావిస్తున్నారు.

బీహెచ్ఈఎల్ కన్సార్షియం కు బాధ్యతలు: ఈ స్లీపర్ కోచ్ ల కోసం బీహెచ్ఈఎల్ నేతృత్వంలో ఉన్న కన్సార్షియం మరో ఆరు సంవత్సరాల్లో 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ. 9600 కోట్లు. టిటాగడ్ వ్యాగన్స్ టెక్నాలజీ సారథ్యంలో భెల్ ఈ రైళ్లను తయారు చేయనున్నది. ఒక్కో స్లీపర్ క్లాస్ రైలు తయారీకి రూ. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
దశలవారీగా ఈ రైళ్లను రైల్వేశాఖకు అందజేయనున్నట్లు భెల్ అధికారులు చెబుతున్నారు. కన్సార్టియం ఐసీఎఫ్ చెన్నైలోని తయారీ యూనిట్‌తో పాటు భారతీయ రైల్వేలు కేటాయించిన రెండు డిపోలలో అందించిన ప్రత్యేక స్థలాన్ని కూడా సన్నద్ధం చేస్తుంది. మిగిలిన రైల్వే కోచ్ లు కంటే మెరుగైన వసతులతో వీటిని సిద్దం చేసేలా డిజైన్లు తయారు చేసారు.

వందేభారత్ లో స్లీపర్ కోచ్ లు: దూర ప్రాంతాల మధ్య నడుస్తున్న వందేభారత్ లో ముందుగా ఈ స్లీపర్ కోచ్ లను ప్రారంభించనున్నారు. దశల వారీగా అన్ని వందేభారత్ సర్వీసుల్లోనూ వీటీని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఈ రెండు రైళ్లల్లో ప్రస్తుతానికి ఉదయం సమయాల్లో నడుపుతుండటంతో స్లీపర్ కోచ్ ల పైన ఆలోచన లేదని సమాచారం.
అదే సమయంలో కొత్తగా అటు బెంగళూరు, ఇటు పూణే కు కొత్తగా రెండు సర్వీసులు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ - బెంగుళూరు సర్వీసుకు మొదటి దశలోనే స్లీపర్ కోచ్ లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, త్వరలోనే వందే భారత్ లో స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications