సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ సమయం మార్పు..!!
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది. వందేభారత్ కోసం ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లను క్రాసింగ్ పేరుతో నిలుపుదల చేస్తున్నారు. అదే విధంగా వందేభారత్ ఆక్యెపెన్సీ కోసం ఇతర రైళ్లల్లో ఏసీ కోచ్ లను తగ్గిస్తున్నారు. ఇక...సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయ పాలనలో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే రైలుకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేసారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకే సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సి ఉంది. అయితే, విశాఖలో ఈ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు (20833) దాదాపు 5 గంటలు ఆలస్యం అయినట్లు చెబుతున్నారు.

తిరిగి అదే రైలు సికింద్రాబాద్‌కు చేరుకొని తిరిగి విశాఖకు వెళ్లాల్సిఉండటంతో ఈ రైలును అధికారులు సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. రైలు దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం కావడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు, వేసవి రద్దీ దఅష్ట్యా ఏర్పాటుచేసిన పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. నిర్దేశిత తేదీల్లో నడుస్తోన్న ఈ ప్రత్యేక సర్వీసులను ఆయా స్టేషన్ల మధ్య మే 30 నుంచి జులై 1 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications