వంగవీటి రాధాకు ముప్పు ఎవరితో ? కోరిన సీటు వద్దని వైసీపీలోకి ? ముందస్తు భద్రత వెనుక !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయిన వంగవీటి వారసుడు రాధాకృష్ణ ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందన్న వ్యాఖ్యలు చేసి అదే వైసీపీ ప్రభుత్వం నుంచి 2 ప్లస్ 2 భద్రత తీసుకున్నారు. ఓవైపు వైసీపీలో చేరతారన్న అంచనాలు, మరోవైపు మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వంశీతో ఉన్న సాన్నిహిత్యం ఆయన్ను టీడీపీలో ఉండనీయడం లేదా ? గతంలో ఎప్పుడో ఎమ్మెల్యేగా పనిచేసిన రాధాకు నిజంగానే ప్రాణ హాని ఉందా ? వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వకముందే ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వంగవీటి వారి పిల్లి మొగ్గలు
ఒకప్పుడు తన తండ్రి రాజకీయంగా ఎదిగిన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన వంగవీటి రాధా, ఆ తర్వాత వైసీపీ, టీడీపీలో చేరినా సక్సెస్ కాలేకపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటములు చవిచూశారు. తనకున్న ఛరిష్మాను ప్రజా బలంగా మార్చుకోవడంలో సక్సెస్ కాకపోవడంతో ప్రజాప్రతినిధిగా గెలవడం వంగవీటికి కష్టసాధ్యంగా మారిపోయింది.
గత ఎన్నికలకు ముందు విజయవాడ తూర్పు లేదా బందరు ఎంపీ స్ధానం ఇస్తామన్నా వద్దని టీడీపీలోకి వెళ్లి ప్రచారానికే పరిమితమైన వంగవీటి రాధా... ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా తిరిగి ఆ పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. దీంతో తన లక్ష్యం మీద కంటే అధికారం కోసం వంగవీటి వారసుడు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఏం కావాలో క్లారిటీ కరవు
ఎమ్మెల్యే కావాలా, అధికార కేంద్రంలో భాగం కావాలా లేక ప్రజాప్రతినిధి అనిపించుకుంటే చాలా... ఇందులో ఏ ఒక్క విషయంలోనూ వంగవీటి రాధాకు క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధా.. ఆ తర్వాత పోటీ చేసినా వరుసగా ఓటములు పలకరించాయి. దీంతో పార్టీలు మారడం మినహా ఈ దశాబ్దకాలంలో చేసిందేమీ లేదు.
ఆయా పార్టీలు కూడా ఆయన్ను కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా మాత్రమే చూస్తుండటం, ఎన్నికల ప్రచారాలకు వాడుకుంటుండటం పరిపాటిగా మారింది. దీంతో ఆయా పార్టీల అవసరాలకు ఉపయోగపడటం మినహా ఇంకేమీ చేయలేని స్దితికి రాధా చేరిపోతున్నారు.

వైసీపీలోకి రీ ఎంట్రీ ప్రయత్నాలు
గతంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల్లో ఉన్న వంగవీటి రాధా .. ఇప్పుడు టీడీపీలో ఉంటూ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన పాత స్నేహితులు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాయంతో వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాధా ప్రయత్నిస్తున్నారు.
తండ్రి రంగా వర్ధంతి రోజే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. వైసీపీలో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడన్నది స్పష్టం కావడం లేదు.

టీడీపీ బంపర్ ఆఫర్
ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామన్న హామీతో ఆయన పోటీకి దిగకుండా ప్రచారానికి పరిమితం అయ్యారు. కానీ మారిన పరిస్ధితుల్లో వైసీపీ వైపు రాధా చూపు ఉందని తేలిపోవడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. విజయవాడ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను గన్నవరానికి పంపి ఆ స్ధానంలో రాధాకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే అప్పటికే వైసీపీలో చేరేందుకు మాట ఇచ్చేసిన రాధా వెనక్కి తగ్గడం లేదు.

ప్రాణహాని ఎవరితో ?
తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీలో చేరతారనుకున్న రాధా కాస్తా.. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అసాధారణంగా ఓ టీడీపీ నేత అయిన రాధాకు 2 ప్లస్ 2 భద్రత కేటాయించింది. దీంతో ఇప్పుడు రాధాకు ఇచ్చిన భద్రతపై చర్చ జరుగుతోంది. వంగవీటి కుటుంబానికి శత్రుత్వం ఉన్న ఏకైక కుటుంబం దేవినేని కుటుంబం మాత్రమే.
అదీ దేవినేని నెహ్రూ బతికున్న కాలంలో మాత్రమే, అదీ వంగవీటి రంగా హత్య తర్వాత దేవినేని కుటుంబం కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా బతికి లేరు. ఆయన వారసుడు దేవినేని అవినాష్ ఎప్పుడూ వంగవీటి కుటుంబంపై విమర్శలు కూడా చేసింది లేదు.
అలాంటి పరిస్ధితుల్లో వంగవీటి రాధా తన హత్యకు రెక్కీ నిర్వహించారని, తనకు ప్రాణహాని ఉందని చెప్పడం వెనుక, భద్రత తీసుకోవడం వెనుక కారణాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎలాగో చంద్రబాబు, భువనేశ్వరిపై వ్యాఖ్యల వ్యవహారంలో తన స్నేహితులు కొడాలి, వంశీకి భద్రత ఉంది. కాబట్టి తనకూ ఉండాలని రాధా కోరుకున్నారా అన్న చర్చ సాగుతోంది.

వైసీపీ ముందస్తు గాలం
వైసీపీలో చేరకుండానే టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకు ప్రాణహాని ఉందన్న కారణంతో ప్రభుత్వం 2 ప్లస్ 2 భద్రత కల్పించింది. వైసీపీ కోణంలో చూస్తే ఇదో అసాధారణ నిర్ణయం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటికే టీడీపీ నేతలకు ఉన్న భద్రతను సమీక్షించింది.చంద్రబాబు భద్రతను కూడా తగ్గించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. అలాంటి సమయంలో వైసీపీ ఇప్పుడు రాధాకు భద్రత కల్పించడం వెనుక ఆయన జారిపోకుండా చూసుకునేందుకే అన్న వాదన వినిపిస్తోంది.

రాధా అసలు ప్లాన్ ఇదే
గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు ప్రస్తుతం రాధా-రంగ మిత్ర మండలితో పాటు ఆయన వర్గంలో సగం మంది దూరమయ్యారు. తన తండ్రిని చంపిన టీడీపీలోకి వెళ్లడంతో పాటు రంగా హత్యలో టీడీపీ పాత్ర లేదని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో టీడీపీలో మరికొంతకాలం కొనసాగలేని పరిస్ధితి రాధాది. దీంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలాగని వంగవీటి రాధాకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మినహా వైసీపీ చేయగలిగిందేమీ లేదు. దీంతో వైసీపీలో ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఆ తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి తీసుకోవాలని రాధా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications