ప్రొద్దుటూరుకు రానివ్వను, సీఎం రమేష్ ఫ్యామిలీ పోటీ చేసేందుకే: వరదరాజులు రెడ్డి
కడప: సొంత పార్టీ ఎంపీ రమేష్ పైన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ల రాజీనామా వెనుక రమేష్ నాయుడి హస్తం ఉందని ఆరోపించారు. తన సోదరుడిని ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయించుకోవడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో రమేష్ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు.
తన ప్రాణం ఉన్నంత వరకూ ఎంపీ సీఎం రమేశ్‌ను తన నియోజకవర్గమైన ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటానని వరదరాజులు రెడ్డి చెప్పారు. తన వైఖరిని తప్పుబడుతూ సీఎం రమేశ్ వర్గానికి చెందిన 22 మంది ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు సోమవారం రాజీనామా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఛైర్మన్ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ముక్తియార్ నిర్వాకం పైన నిప్పులు చెరిగారు. వైసీపీ కండువా వేసుకుని టీడీపీలో కొనసాగడం ఎంతవరకు సబబో చెప్పాలని నిలదీశారు. అప్పుడూ ఇప్పుడూ సీఎం రమేశ్ వెనుక నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తాను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుంటే రమేష్ ఎందుకు అడ్డు పడుతున్నారని నిలదీశారు.
మైనార్టీ వార్డులకు సంబంధించిన సమావేశం పెట్టడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలపడాన్ని తప్పుబట్టారు. ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కౌన్సిలర్ల రాజీనామాల వెనుక ప్రధాన కారణం సీఎం రమేశ్ కుటుంబంలోని వ్యక్తులు ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనే అన్నారు.
ప్రొద్దుటూరు రాజీనామాల వ్యవహారంపై పార్టీ అధిష్టానం అడిగితే వాస్తవాలు చెబుతానని, తనకు తానుగా ఏమీ చేయనని చెప్పారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కట్టుబడి పనిచేస్తామని, అయితే ఇలాంటి రాజకీయాలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications