రజినీకాంత్ పై విమర్శలకు తెలుగు, తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: వర్ల రామయ్య డిమాండ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. రజినీకాంత్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వైసీపీనేతలు, ఏకంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రజినీకాంత్ కూడా సపోర్టు చేశాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడడం, ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
రజినీకాంత్ ఏపీలో చేసిన వ్యాఖ్యలతో హీరో నుంచి జీరో అయిపోయారని మండిపడుతున్నారు. రజినీకాంత్ ఇప్పటికైనా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు కూడా ఎదురు దాడి మొదలుపెట్టారు. తాజాగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వైసిపి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, వైసిపి నేతలను కానీ, సీఎం జగన్ ని కానీ రజినీకాంత్ ఒక్క మాట కూడా అనలేదన్నారు.

అయినప్పటికీ రజినీకాంత్ ను టార్గెట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఫ్రస్టేషన్లో ఉన్నారని అందుకే రజినీకాంత్ పై మాటల దాడి చేస్తున్నారని విమర్శించారు. రజినీకాంత్ పై వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రేకెత్తే ప్రమాదం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే అటు తెలుగు ప్రజలకు, తమిళ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ కావాలని రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను అనరాని మాటలు అనిపించి, ఆయనను కించపరిచారని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగా చేసిన అభివృద్ధి మంత్రి రోజాకు కనిపించక పోవడం దురదృష్టకరమని ,ఇక బూతులు మాట్లాడే కొడాలి నాని కూడా విమర్శలు చేసేవాడు అయ్యాడని వర్ల రామయ్య మండిపడ్డారు.
రజినీకాంత్ ను ఉద్దేశించి రోజా చేసిన కామెంట్లతో ఆయన అభిమానులకు ఆగ్రహం వస్తే రోజా పరిస్థితి ఏమిటో ఆమె చెప్పాలని వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రజలు తమ పైన తమ ప్రభుత్వ పాలన పైన తిరుగుబాటు చేస్తారనే అర్థమయ్యే మంత్రులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications