రక్తచరిత్ర కాదు: వాసిరెడ్డి, బాబుది మోసమన్న అంబటి

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కరరెడ్డి మరణం పోలీసులతో తెలుగుదేశం పార్టీ నేతలు చేయించిన రాజకీయ హత్య అని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి గానీ.. రక్త చరిత్ర కాదని చంద్రబాబుకు హితవు పలికారు. టిడిపి హత్య రాజకీయాలను తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. హత్యా రాజకీయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.
చంద్రబాబు దగా చేయబోతున్నారు: అంబటి
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రైతుల రుణాల మాఫీ హామీ అమలు చేయకుంటే రైతులు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం రైతులను మోసం, దగా చేయబోతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. రుణమాఫీ అంటే రీషెడ్యూల్ చేయడమా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా రీషెడ్యూల్ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని అంబటి దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications