చంద్రబాబు బోండా ఉమకు చీర కట్టి పంపించారు; చెప్పుదెబ్బలు తప్పవన్న వాసిరెడ్డి పద్మ
టిడిపి నేత బొండా ఉమా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన వ్యవహారం, ఆపై ఆమె స్పందించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ అంటే ఒసేయ్ అనలేమా అని ప్రశ్నించిన ఆయన వాసిరెడ్డి పద్మ బజారు మనిషిలా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. గ్యాంగ్ రేప్ జరిగిన బాధితులను పరామర్శించడానికి మూడు రోజుల తర్వాత మేకప్ చేసుకొని వచ్చారంటూ విమర్శించారు. ఇక తాజా బోండా ఉమ వ్యాఖ్యలకు వాసిరెడ్డి పద్మ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

బోండా ఉమా చిల్లర రౌడీ
టిడిపి నేత బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ వాసిరెడ్డి పద్మ బోండా ఉమా ఒక చీడపురుగు అంటూ వ్యాఖ్యానించారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నారని, మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పని చేస్తున్నా ఏ రోజు పబ్లిసిటీ గురించి తాను పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని, కానీ ఆయన చిల్లర రౌడీ అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడు రూపంలో ఉన్న కాలకేయుడు అంటూ బోండా ఉమ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

బోండా ఉమ రాజకీయంలో చంద్రబాబు పావుగా మారాడు
సాదాసీదాగా వెళ్లే చంద్రబాబు పరామర్శ విషయంలో బోండా ఉమ కావాలని ఓవరాక్షన్ చేశాడని మండిపడ్డారు. బోండా ఉమ రాజకీయంలో చంద్రబాబు పావుగా మారాడని వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేతలు తనపై దాడి చేసిన అంశాన్ని తాము వ్యక్తిగత దాడిగా పరిగణనలోకి తీసుకోలేదని, మహిళా కమిషన్ పై జరిగిన దాడి గానే తాము భావిస్తున్నామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

బోండా ఉమకు చెప్పు దెబ్బలు తప్పవు
మహిళా నాయకులు, బాధితులపై ఎలా వ్యవహరించాలో టిడిపి నేతలకు క్లాస్ తీసుకుందామని అనుకున్నామని తెలిపిన వాసిరెడ్డి పద్మ బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. తాను తలచుకుంటే హైకోర్టులో ప్రైవేటు కేసు వేయగలనని ఆమె స్పష్టం చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే బోండా ఉమకు చెప్పు దెబ్బలు తప్పవంటూ హెచ్చరించారు.

చంద్రబాబు బోండా ఉమ కు చీరకట్టి మహిళలపై పోరాటానికి పంపాడు
మహిళలు బోండా ఉమకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్న వాసిరెడ్డి పద్మ బోండా ఉమకి ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 27వ తేదీన కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు బోండా భూములకు భయమంటే అని ప్రశ్నించారు. చంద్రబాబు బోండా ఉమ కు చీర కట్టి నా పదవి పోయే వరకు పోరాటం చెయ్యమని చెప్పి పంపించారా అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications