మేం ర్యాగింగ్ చేస్తే.. చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తావ్: వెల్లంపల్లి కౌంటర్ అటాక్
విజయవాడ: గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు..ధీటుగా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ మళ్లీ తెలుగుదేశం పార్టీ పంచన చేరుతారనేది ఈ సభతో ఖాయమైందని వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ నుంచి రోడ్ మ్యాప్ తీసుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు.

మరొకరిని ముఖ్యమంత్రి చేయడానికి తపించే వ్యక్తి..
రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు.. తాను అధికారంలోకి రావాలి.. ప్రజలకు మంచి చేయాలి అని తపించాలే తప్ప మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని వెల్లంపల్లి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే విమర్శించారు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఆయన పైనే విమర్శలు చేస్తున్నారంటే- పవన్ కల్యాణ్ ఎవరి కోసం పని చేస్తున్నాడనేది ఇక్కడే స్పష్టమౌతోందని చెప్పారు.

ప్రతిపక్షంలో అద్భుతాలు చేయొచ్చన్నావుగా..
ప్రతిపక్షంలో ఉంటూ అద్భుతాలు చేయొచ్చంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తమ పార్టీని విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, టీడీపీనీ ఎందుకు విమర్శించట్లేదని ప్రశ్నించారు. ఆయనకు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చురకలు అంటించారు. జనసేన..అమ్ముడు పోవడానికి పెట్టిన పార్టేనని, ఆవిర్భావ సభ కూడా అలాంటిదేనని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.

పవన్‌ను నమ్ముకోవద్దు..
పవన్ కళ్యాణ్ వంటి రాజకీయ బ్రోకర్ ఏపీకి అవసరం లేదని, అసలాయన గురించి ప్రజలు ఆలోచించడం కూడా మానేశారని చెప్పారు. ఆ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌ను నమ్ముకోవద్దని తాను జనసేన కార్యకర్తలకు సూచిస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు గానీ.. నిజ జీవితంలో రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకేస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, ఆయనకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ పట్టుదల ఇదీ..
తండ్రి మరణించిన తరువాత వైఎస్ జగన్ ఎన్నో కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారని, ప్రజలకు మంచి చేయాలని తపించారని గుర్తు చేశారు. ప్రారంభంలో 18 మంది, 2014లో 67 ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకున్నారని, 2019లో ఏకంగా 151 మంది శాసనసభ్యుల బలాన్ని ఆయన సాధించుకున్నారని వెల్లంపల్లి అన్నారు. వైఎస్ జగన్ పట్టుదల, ప్రజలకు మేలు చేయాలనే తపనకు ఇది నిదర్శనమని వెల్లంపల్లి చెప్పారు. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా పవన్ కల్యాణ్ ఏం సాధించారని నిలదీశారు.

చంద్రబాబును ప్రశ్నించావా?
చంద్రబాబు హయాంలో విజయవాడలో అభివృద్ధి పేరుతో 45 దేవాలయాలు కూల్చేస్తే పందులు కాశావా?, పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబును ప్రశ్నించకుండా గాడిదలు కాశావా? అంటూ పవన్ కల్యాణ్‌పై వెల్లంపల్లి చెలరేగిపోయారు. వికేంద్రీకరణే తమ లక్ష్యమని వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్తే.. ప్రజలు ఆశీర్వదించారని, 151 సీట్లను ఇచ్చారని అన్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని పుస్తకాలు చదవడం తప్ప ప్రజల జీవితాలను చదవడం పవన్ కల్యాణ్‌కు తెలియదని అన్నారు.

చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తావ్..
ఐపీఎల్ తరహాలో ప్యాకేజ్ రేటు పెంచుకోవడానికే పవన్ కల్యాణ్ జనసేన సభను నిర్వహించారే తప్ప, పార్టీ విధి విధానాలను ప్రజలకు తెలియజేయడాని లేదా.. క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయడానికి కాదని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఆరోపించారు. త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్‌కు ఏమీ రాదని, తాము వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ పది నిమిషాలు కూడా తట్టుకోలేరని, చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications