కిరణ్ డ్రామాకు స్ర్కిప్టు ఢిల్లీలోనే: వెంకయ్య ధ్వజం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆడుతున్న నాటకానికి ఢిల్లీలోనే స్ర్కిప్టు తయారవుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హవాను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు సెమీ ఫైనల్స్ లాంటివని, మార్చిలో ఫైనల్స్ జరుగుతాయని వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆయన తెలిపారు.

మా ఇంటిని మేమే తగలబెట్టుకున్నాం: లగడపాటి
తమ ఇంటిని తామే తగులబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా సమైక్యవాదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పిందేదీ ఇప్పటి వరకు జరగలేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులమంతా సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతో కృషి చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించకుండా విభజన ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని తెలిపారు. తాను సమైక్య వాదినని, వ్యక్తిగత హోదాలో సమైక్య రాష్ట్రంలో కోసం అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications