టీ, ఏపీలో ఆగ్రహం, రంగంలోకి వెంకయ్య: 30కి పైగా మంత్రులను అడిగారు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు పైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆయా అంశాలకు సంబంధించిన కేంద్రంత్రులతో చర్చించారు. ఏపీకి, తెలంగాణకు ఏమేమి ఇస్తున్నారు, ఇంకా ఏం ఇవ్వాలనే విషయాల పైన ఆయన వారితో చర్చించారు. ఏపీకి సాయం పైన సీనియర్ మంత్రులతో మాట్లాడారు.
ముప్పైకి పైగా మంది మంత్రులతో సమీక్ష నిర్వహించారు. రామ్ విలాస్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, సురేష్ ప్రభు, హర్షవర్ధన్, జేపీ నడ్డా, సదానంద గౌడ, బీరేంద్ర చౌధరి, అశోక గజపతి రాజు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, గీతే, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, గోయల్, ఓరం తదితరులు హాజరయ్యారు.

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్య రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాల్లో ఉండగా, పార్లమెంట్‌లో వెంకయ్య చాంబర్‌కు ఇంత పెద్ద స్థాయిలో కేంద్రమంత్రులు హాజరై, వివరణ ఇచ్చారు.
రెండు రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టుల అమలుకు చర్యల్ని వేగవంతం చేయాలని, ఆయా సర్కార్లనుంచి వచ్చే ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల పైన వివరణ ఇచ్చారు.

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జాతీయ రహదారులు ఏర్పాటు చేసే ప్రతిపాదనల్ని ఆమోదించామని, త్వరలో కేంద్ర అధికారులు తెలుగు రాష్ట్రాలకు వెళ్తారని రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు తగిన చర్యల్ని తీసుకుంటున్నామనిఉమాభారతి చెప్పారు. తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు సూచించిన స్థలానికి సంబంధించిన ప్రతిపాదనను తన మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆమోదించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఐఐటీ, ఐఐఎ్‌సఈఆర్‌లకు శంఖుస్థావన చేసేందుకు తాను ఏపీకి వెళ్తున్నట్లు చెప్పారు.
మంగళగిరిలో ఎయిమ్స్‌ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించామని ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా తెలిపారు. రామగుండంలో ఫర్టిలైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎ్‌ఫసిఐఎల్) యూనిట్‌ను పునరుద్ధరించేందుకు, గ్యాస్ ఆధారిత ఎరువుల ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యల్ని ప్రారంభించామని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు.
కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పే విషయంపై సెయిల్ తన మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదిక సమర్పించిందని, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని గనులు, ఉక్కు కర్మాగార మంత్రి తోమర్ చెప్పారు. ఏపీలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను నెలకొల్పే విషయంపై సాంకేతిక అధ్యయనం ప్రారంభమైందని పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
రామగుండం ప్రాజెక్టులోని ఎంజిఆర్ ప్రాంతంలో 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభమవుతుందని విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. హైకోర్టు విభజన పైన తమకు అభ్యంతరం లేదని కేంద్రమంత్రి సదానంద గౌడ చెప్పారు. ఏపీ లో కొత్తగా ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటుపై సుష్మా స్వరాజ్‌తో వెంకయ్య చర్చించారు. మండలి సీట్ల పెంపు అంశంపై చర్చించారు.












Click it and Unblock the Notifications