ఏపీకి త్వరలో తీపీ కబురు, ఆ వార్త బాధ కలిగించింది: వెంకయ్య

హైదరాబాద్/నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందజేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విభజనతో ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర సహకారం ఉంటుందని చెప్పారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ్భారత్ ట్రస్టు 15వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధును, కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు.

రాష్ట్రంలో 52 వేల కోట్ల వ్యయంతో మూడు పెట్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనన్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వీటిలో పెట్రోలియం యూనివర్శిటీ, విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణ, పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాలు ఉంటాయని, త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారని తెలిపారు.

ప్రోత్సాహంతోనే ఉత్సాహం: సుమిత్రా మహాజన్

క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి తగిన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ క్రీడల్లో మరిన్ని పతకాలు గెలవడం సాధ్యమవుతుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన సింధు ఈసారి స్వర్ణ పతకం సాధించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉంటే ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవచ్చునన్నారు. తల్లిని, మాతృభూమిని, గురువును ఎన్నడూ మరచిపోకూడదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యువతీయువకులకు అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలూ పెంపొందిస్తున్నారని తెలిపారు.

మరింత రాణిస్తా: సింధు

ఒలింపిక్ విజేత పివి సింధూ మాట్లాడుతూ.. క్రీడా రంగంలో మరింత రాణించి దేశానికి కీర్తిప్రతిష్టలను తీసుకొస్తానని తెలిపారు. ప్రతిఒక్కరు గురువులను, తల్లిదండ్రులను మరిచిపోకూడదన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను రాణించినట్లు ఆమె తెలిపారు. ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పదిహేనేళ్ల క్రితం స్వర్ణ్భారత్ ట్రస్టు ప్రారంభానికి వచ్చానని, మళ్లీ ఇప్పుడు పాల్గొనడం ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అన్నారు.

ఏపీకి తీపికబురు: సాయమందించడంలో రెండో ఆలోచన లేదు

ఇది ఇలా ఉండగా, వెంకయ్యనాయుడు ఓ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు విసుగు లేదు. అభివృద్ధి గురించి ఆలోచించటంలో విరామం లేదు. విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం అందించటంలో రెండో ఆలోచన లేదు. రాజకీయ జీవితం సేవ చేసే భాగ్యాన్ని కలిగించింది. దేశ ప్రజల కోసం.. రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించటంలో వెనుకాడే ప్రసక్తి లేదు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించటానికి నా వంతుగా కృషి చేస్తున్నా' పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కేంద్రం అందిస్తున్న సాయం.. ప్రత్యేక హోదాకు సంబంధించి త్వరలో వెలువడనున్న ప్రకటన విషయంలో కేంద్రమంత్రి హోదాలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. 'కేంద్రం త్వరలో ప్రకటించే ప్రకటన సారాశం ముందు చెబితే అందులో ఉండే తీపి పోతుంది. నా విభాగం నుంచి మొదటి సంవత్సరం మార్చిలోగా రూ.వెయ్యి కోట్లను మంజూరు చేశాను' అని తెలిపారు.

'వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఇచ్చిన మొత్తం రూ.36 వేల కోట్లు. దీన్ని కొందరు ముష్టి వేశారా? అంటున్నారు. కొంతమందికి రూ. 36 వేల కోట్లు పెద్ద మొత్తం కాకపోవచ్చు. ఇలాంటి వాళ్ల విమర్శలకు వెరసి వెనక్కు తగ్గేది లేదు. కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేయాలి. ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా కేంద్ర సాయం పదేళ్లపాటు కొనసాగాలి. 35 మంది మంత్రులను, కేంద్రమంత్రులను ఒకచోట చేర్చి.. చట్టంలో పేర్కొన్న అంశాలు.. ప్రధాని అప్పుడు ఇచ్చిన హామీలపై త్వరగా చర్య తీసుకోవాలని కోరాను' అని చెప్పారు.

చంద్రబాబుకు భయమా?

'కొంతమంది చంద్రబాబు భయపడుతున్నారని అంటున్నారు. ఆయనకు అక్కడ ఏవో ఉన్నాయని (కేసులు) అంటున్నారు. కాని చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి విచారణ ప్రతిపాదనలేవీ కేంద్రం దగ్గర లేవు. ఇలాంటి చౌకబారు ప్రచారాలు, రాజకీయాలు చేయవద్దని కోరుతున్నా' అని వెంకయ్య స్పష్టం చేశారు.

చట్టంలో లేదు

'పోలవరం విషయంలో కాంగ్రెస్‌ ప్రజలకు నమ్మకద్రోహం చేసింది. చట్టంలో అడ్డంకులు తొలగిస్తామని చెప్పారు. ఎందుకు తొలగించలేదు? జాతీయ ప్రాజెక్టు చేస్తామన్నారు. ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఎక్కడా చెప్పలేదు? పోలవరం విషయంలో గత 34 ఏళ్లలో పురోగతి ఏమిటో, రెండేళ్లలో ఎంత జరిగిందో చూడాలి ' అని అన్నారు.

'నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం అభివృద్ధి చేస్తూనే ఉంటా. భవిష్యత్తులోనూ చేస్తా. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉంది. దాంతో అన్ని సమస్యలు పోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆర్థికమంత్రిని కలిసిన సందర్భంలో చెప్పా. ప్రత్యేక హోదా అంటే ఏంటి? దానివల్ల వచ్చే లాభం ఏంటి? హోదా.. దాంతో సమానమైన.. దాన్ని మించిన ప్యాకేజీ ఇవ్వటానికి ఏం చేస్తే బాగుంటుందో సూచించా' అని చెప్పారు.

'14వ ఆర్థిక సంఘంతో ఏర్పడిన సందిగ్ధతకు వారంరోజుల్లోనే తెరదించాలని ప్రధాని.. ఆర్థికమంత్రికి చెప్పాను. ఇదే విషయమై ముఖ్యమంత్రితో కూడా మాట్లాడా. ప్రధాని మోడీ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర విషయమై ఆర్థికమంత్రి, అమిత్‌షా, ఇతర ముఖ్య నాయకులు కలిసి చర్చించి ముసాయిదా తయారు చేశాం. ప్రధాని పరిశీలన తర్వాత ప్రకటిస్తాం. ప్రకటన సమయంలో ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ ఉండాలని సూచించాను. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడుతుంది' అని వెంకయ్య స్పష్టం చేశారు.

హోదాతో.. అన్నీ రావు

'కొంతమంది ప్రత్యేక హోదా ఇస్తే ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుందని మాట్లాడుతున్నారు. అవగాహన లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేనెప్పుడూ ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదు. కొన్ని పత్రికలు అలా రాశాయి. అయితే ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 50:50 శాతం ప్రకారం నిధులు అందుతాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక అది 60:40 శాతానికి పెరిగింది. ప్రత్యేకహోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌కు 90:10 శాతం ప్రకారం నిధుల పంపిణీ ఉంటుంది. ఇదొక్కటే తేడా. దీనివల్ల రాష్ట్రానికి ఎంత లాభం వస్తుందంటే.. ఎంత మొత్తం కేంద్రం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందో అందులో వాటా దక్కుతుంది' అని వివరించారు.

హోదా అడిగింది నేనే

'ప్రత్యేక హోదా గురించి అడిగింది నేనే. అప్పట్లో ఎవరూ నోరెత్తలేదు. అప్పట్లో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు. అందుకే అడిగాను. ఇప్పుడు కేంద్రం ఎన్నో అభివృద్ది పనులను చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. లోటు ఉన్నచోట దానిని పూరించండని సూచించింది. రాష్ట్రాల మధ్య ఎక్కడా వ్యత్యాసం చూపొద్దని పేర్కొంది. దీని అర్థం పరోక్షంగా ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని సూచన. అయినా ఇప్పటికీ ఆర్థికమంత్రితో నేను మాట్లాడుతున్నాను. 14వ ఆర్థిక సంఘం రాకముందే ప్రధాని హామీ ఇచ్చారు కనుక దాన్ని నెరవేర్చాలని కోరా. హామీ వేరు, చట్టం వేరని ఆర్థికమంత్రి చెప్పారు' అని తెలిపరాు.

'అప్పటి ప్రభుత్వం చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పెడితే ఇప్పుడీ సమస్య ఉండేది కాదు. 14వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం,
పార్లమెంటు ఆమోదించాయి. ఇక వెనక్కు వెళ్లే అవకాశం లేదు. కేంద్రంలో ప్రత్యేక హోదా అనేది భావనాత్మకమైంది. ఇదే విషయాన్ని ప్రధాని, నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లాను. నీతి ఆయోగ్‌లో రెండు విషయాలపై చర్చిస్తున్నారు. 14వ ఆర్థికసంఘం ఏర్పాటుతో ఏర్పడిన సందిగ్ధత.. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి' అని అన్నారు.

హైదరాబాద్/నెల్లూరు

'ఒడిశా, బీహార్‌, పశ్చిమబెంగాల్, అసోం.. ఇలా 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కాకుండా మినహాయింపులు ఇస్తే పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతాయి. ఇది మంచిది కాదు అని పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నాయకుడు వీరప్పమొయిలీ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక మినహాయింపులు ఇస్తే మా రాష్ట్రం నష్టపోతుంది.. పెట్టుబడులు తరలిపోతాయని జయలలిత లేఖ రాశారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు తీర్మానం పెట్టినపుడు చాలా రాష్ట్రాలు ఏపీని సమర్థించాయి. ఏపీకి ఇవ్వండి.. మాకు కూడా ఇవ్వండని అడిగారు. తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఇస్తే ఆ హోదాకు అర్థం లేకుండా పోతుంది' అని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల గురించి అడిగా

'మనసులో కొంత బాధ కలుగుతుంది. నేను ఆంధ్ర నుంచి ఎంపిక కాలేదు. మంత్రిని కాదు. తెలుగు రాష్ట్రంలో పుట్టాను. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాన్ని నిలదీశాను. కేవలం ప్రత్యేక హోదా అంశమే కాదు.. అప్పటి ప్రసంగాన్ని చదవకుండా మాట్లాడితే ఎలా? గాలేరు-నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. ఇలా అనేక అంశాల గురించి మాట్లాడాను. నేను తీసుకున్న చొరవ ఫలితంగా అవన్నీ విభజన చట్టంలో చేరాయి' అని తెలిపారు.

తప్పుడు వార్త.. బాధ కలిగించింది

'ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఇది నన్ను ఎంతగా కలచివేసిందంటే.. నెల్లూరులో సారా ఉద్యమాన్ని నడిపించిన దూబగుంట రోశమ్మ విషయంలో వచ్చిన ఆరోపణలతో మనస్తాపానికి గురి కావాల్సి వచ్చింది. ఆమెకు ఆరోగ్యం బాగోకున్నా ఎవరూ పట్టించుకోలేదు. నేను పత్రికల ద్వారా తెలుసుకుని ఢిల్లీ నుంచి స్థానిక నాయకులకు ఫోన్‌ చేసి రూ.50 వేలు ఇవ్వాలని చెప్పాను. ఇటీవల చనిపోయింది. ఓ తెలుగు దిన పత్రిక రోశమ్మకు రూ. 50 వేల చెక్కు ఇచ్చి.. వెనక్కు లాక్కున్నాడని ప్రచురించింది. ఇది నన్ను చాలా బాధించింది.

నేను ఆంధ్ర పక్షపాతిని కాదు

'నేను రాష్ట్రంలో మొదటిసారిగా ఏపీకి 1.93 లక్షల ఇళ్లను మంజూరు చేశాను. చంద్రబాబు శ్రద్ధ తీసుకుని భూమి.. లబ్ధిదారులను గుర్తించి కేంద్రానికి పంపారు. వెంటనే ఇళ్లను మంజూరు చేశాను. వెంటనే తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల మొత్తం ఆంధ్ర పక్షపాతం చూపారని విమర్శించారు' అని చెప్పారు.

అంతేగాక, 'నేను తెలంగాణ వారికి ప్రతిపాదనలను పంపాలని సూచించాను. 84 వేల ఇళ్లను మంజూరు చేశాను. మిగతా రాష్ట్రాల వాళ్లు విమర్శిస్తున్నారు. స్మార్ట్స్‌ సిటీల విషయంలో ఇలాగే జరుగుతుంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లింది. అందుకే కేంద్రం తరచుగా ఆంధ్రకు సాయం చేస్తుందని అనుకునే పరిస్థితి లేదు' అని వెంకయ్యనాయుడు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+