మడమ తిప్పలేదు: ఎన్టీఆర్‌పై వెంకయ్య ప్రశంసలు, ఏదైనా సాధిస్తాం
విజయవాడ: స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్ అన్నారు. మడమ తిప్పని మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.

కృష్ణాజిల్లా చల్లపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. చల్లపల్లిలో స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. స్వచ్ఛ చల్లపల్లి కోసం కృషి చేస్తున్న డాక్టర్ డిఆర్కె ప్రసాద్, పద్మావతిలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

స్వచ్ఛ భారత్‌లో చల్లపల్లి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతరం సాగాల్సిన కార్యక్రమం గ్రామాలు, పల్లెల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండాలని సూచించారు. చల్లపల్లి మాదిరిగా దేశంలోని అన్ని పల్లెలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. మహనీయుల నుంచి మనం నేర్చుకోవాలని చెప్పారు. చల్లపల్లిలో సుందరీకఱణ పనులు దేశానికే స్ఫూర్తిగా నిలిచాయన్నారు.

మహాత్మా గాంధీ 150వ జయంతి 2019 నాటికి దేశం స్వచ్ఛ భారతం కావాలన్నారు. 4,040 పట్టణాలలో కోటి మరుగుదొడ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నాయకులు గట్టిగా ఉండి ప్రజల భాగస్వామ్యంతో పని చేస్తే ఏదైనా విజయవంతమవుతుందన్నారు. ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన జన్ ధన్ కార్యక్రమే ఇందుకు ఉదాహరణ అన్నారు.












Click it and Unblock the Notifications