నీచ రాజకీయాలు, మోడీని ఆపలేరు: వెంకయ్య
హైదరాబాద్: తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి చోటామోటా రాజకీయ నాయకుల వరకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. మోడీ నాయకత్వంలోని ఎన్డియె 330కు పైగా లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని, ఇతర పార్టీల మద్దతు అవసరం రాదని ఆయన శనివారం మీడియా ప్రతిధుల సమావేశంలో అన్నారు.
ప్రధాని కాకుండా మోడీని ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు వ్యక్తిగత దూషణలకు, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. అమిత్ షా, స్నూప్ గేట్ వివాదంపై కాంగ్రెసు నాయకులు అర్థం లేని విమర్శలు చేసి ఆభాసుపాలయ్యారని ఆయన అన్నారు. చివరికి మోడీపై కులప్రసక్తి తెచ్చి కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడిందని ఆయన అన్నారు. తాము కులప్రసక్తి ఏనాడూ తేలేదని ఆయన స్పష్టం చేశారు.

తమ వైఫల్యాలకు సోనియా, రాహుల్ గాంధీ సహా కాంగ్రెసు నాయకులు సంజాయిషీ చెప్పలేకపోతున్నారని, ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోతున్నారని, కొత్త ఆలోచనలు లేక రాజకీయంగా దివాళా తీసి అబద్ధాలు చెబుతూ ఆభాసుపాలవుతున్నారని ఆయన అన్నారు. ఇష్రాత్ కేసులోనూ కాంగ్రెసు నాయకులు అబద్ధాలు చెప్పారని ఆయన అన్నారు.
యుపిఎ ప్రభుత్వం కుంభకోణాలమయంగా మారిందని ఆయన విమర్శించారు. మోడీ భూసేకరణ విధానాన్ని స్వయానా కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ ప్రశంసించిందని, ఇప్పుడు దానిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వం పలు రంగాల్లో అవార్డులు సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications