సభలో ఆకట్టుకున్న వెంకయ్య పిట్టకథ: కాంగ్రెస్ సహకరించడం లేదు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు తీరుని మెచ్చుకోవాల్సిందే. మంచి వాగ్ధాటి ఉన్న వెంకయ్య ఏ విషయంపై నైనా అనర్గళంగా మాట్లాడగలరు. తాజా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను అన్నీతానై వెంకయ్య నాయుడు నడిపిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యర్ధులు వేసిన కౌంటర్లకు రీకౌంటర్లు వేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. అంతేకాదు సభను సజావుగా నడిపించేదుకు, విపక్షాలపై తనదైన శైలిలో విమర్శిస్తూ, పిట్టకథలు కూడా చెప్తుంటారు. సరిగ్గా అలాంటి పిట్టకథే ఒకటి ఈరోజు సభలో చెప్పారు.

లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా స్వరాజ్ వివరణ ఇచ్చారు. అనంతరం మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన ఓ మంత్రిని అకారణంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా సభకు ఓ పిట్ట కథ వినిపించారు. పిట్ట కథపై వివరాల్లోకి వెళితే...
ఓ ఇద్దరు వ్యక్తులు మద్రాసు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై గొడవ పడుతున్నారు. ఈ సమయంలో వారిద్దరి చూట్టూ కొంత మంది గుమిగూడారు. వారిలో ఒక పెద్దాయన ఎందుకు గొడవ పడుతున్నారని అడిగారు. అతనిని తగువు తీర్చమని వారిద్దరు కోరగా, అందుకు అంగీకరించిన ఆయన అసలు విషయం చెప్పమని అడిగాడు.

దీంతో గొడవకు కారణమైన వ్యక్తి మాట్లాడుతూ, అయ్యా నాకు అతను 25 వేల రూపాయలు ఇవ్వాలి, అడిగితే ఇవ్వడం లేదు అని ఆరోపించాడు. దీంతో రెండో వ్యక్తి మాట్లాడుతూ, అయ్యా అతనెవరో కూడా నాకు తెలియదు. ఆయనను చూడడం ఇదే మొదటిసారి. రైలు దిగుతున్న తనను డబ్బులివ్వాలంటూ అడుగుతున్నాడని చెప్పాడు. దీంతో ఆలోచించిన పెద్దమనిషి నీకు ఎంతివ్వాలి అని అడిగాడు. 25 వేలు అని చెప్పాడు.
నువ్వేమంటావ్ అని రెండో వ్యక్తిని అడగ్గా నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని సమాధానం చెప్పాడు. దీంతో ఆ పెద్దమనిషి సరే ఓ 15 వేలు ఇవ్వు అని తీర్పు చెప్పివెళ్లి పోయాడని అన్నారు. కాంగ్రెస్ తీరు అదే విధంగా ఉందని అన్నారు. లలిత్‌గేట్ విషయంలో సుష్మా రాజీనామా చేశాకే చర్చ అని కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతున్నారని తెలిపారు.

వాస్తవ అంశాలను పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 3న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పామని గుర్తు చేశారు. ఈ సమావేశం తర్వాత పార్టీలన్నీ ముందు సభ సజావుగా జరికేందుకు సహకరిస్తామని చెప్పాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ మాత్రం సభ సజావుగా జరిగేందుకు సహకరించడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications