మాతృభాషపై వెంకయ్య మమకారం .. ఏం చెప్పారంటే ....
మాతృభాషా దినోత్సవం సందర్భంగా అమ్మ భాషపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన మమకారాన్ని చాటి చెప్పారు. ఏ భాష అయిన అనర్గళంగా మాట్లాడే వెంకయ్య నాయుడు తెలుగు పై తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అమ్మ భాషను ప్రేమించడమంటే మిగిలిన భాషలను వదిలేయమని కాదన్నారు. భాషను కాపాడుకోవడం అంటే సొంత సమాజాన్ని కాపాడుకోవడమని గుర్తించాలన్నారు.
భాషా మాధుర్యాన్ని చాటి చెప్పిన ఆయన ఆనందమైనా, బాధనైనా సొంత భాషలో వ్యక్తీకరించినప్పుడే పరిపూర్ణంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమనీయమైన, రమణీయమైన అందమైన అమ్మ భాషకు ఇప్పుడు కొందరు దూరమవుతున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చి సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన ఆయన పర భాషలు ఎన్ని నేర్చుకున్నా, స్వభాష గొప్పతనం మాటలలో చెప్పలేనిది అని కొనియాడారు. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే జరిగేలా చూడాలని చెప్పిన వెంకయ్య నాయుడు ఇందుకు ప్రభుత్వ పరంగా కృషి జరగాలన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ్యులు 22 భాషల్లో మాట్లాడుకునే అవకాశాన్ని తాను కల్పించినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ భాషాభిమానంతో ప్రవర్తించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications