పొత్తులపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు; అమిత్ షా, జేపీ నడ్డాలకు కౌంటర్!!
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఎన్నికలు రాక ముందే మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి పాలన సాగిస్తుందని జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.
చాలా కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మళ్లీ వైసిపి రాజకీయాలలో యాక్టివ్ గా మారిన ఆయన తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.

బిజెపి అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన వైసిపి పాలనలో అంతులేని అవినీతి జరిగిందని అమిత్ షా, జేపీ నడ్డాలు ఆరోపణలు చేశారని, అయితే ఎక్కడ అవినీతి జరిగిందో మాత్రం చెప్పలేకపోయారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆడిటింగ్ లో ఏమైనా అవినీతి గుర్తించారా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని ఆయన వెల్లడించారు. పార్టీల మధ్య అటువంటి పరిస్థితి ఉండబోదని, పోటీనే ఉంటుందన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విజయసాయి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైసిపి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొన్న ఆయన తమ పార్టీ కార్యకర్తలను ఎన్నికలలోపు సంతృప్తి పరుస్తామని వెల్లడించారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నవంబర్ లో ఇతర రాష్ట్రాల హామీలను కూడా కాపీ కొట్టి రెండో మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారేమో అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications